50 మంది ఐపీఎల్​ ప్లేయర్లకు డోపింగ్​ పరీక్షలు

-

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020లో భాగమయ్యే క్రికెటర్లకు డోపింగ్‌ పరీక్షలు నిర్వహించేందుకు జాతీయ డోపింగ్‌ నిరోధక సంఘం (నాడా) ప్రణాళిక సిద్ధం చేసుకుంది. టోర్నీ జరిగే సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు మూడు విడతల్లో ఈ పరీక్షలు చేపట్టనున్నారు. విరాట్‌ కోహ్లీ, మహేంద్రసింగ్‌ ధోనీ, రోహిత్‌ శర్మ సహా స్టార్‌ క్రికెటర్ల 50 నమూనాలను సేకరించనున్నారు.

ఐపీఎల్‌లో డోపింగ్‌ కార్యకలాపాలను అడ్డుకొనేందుకు నాడా ఐదు ‘డోప్‌ నియంత్రణ కేంద్రాలు’ (డీసీఎస్‌) ఏర్పాటు చేయనుంది. మ్యాచ్​లు నిర్వహించే దుబాయ్‌, షార్జా, అబుదాబి స్టేడియాల్లో మూడు కేంద్రాలు ఉంటాయి. ఆటగాళ్లు సాధన చేసే ఐసీసీ అకాడమీ, జాయెద్‌ క్రికెట్‌ స్టేడియాల్లో మిగతా రెండు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని తెలిసింది. ఆడేటప్పుడు, సాధన చేసేటప్పుడు నిక్కచ్చిగా పరీక్షలు నిర్వహిస్తారని సమాచారం.ఆటగాళ్ల మూత్రమే కాకుండా రక్త నమూనాలూ సేకరించేందుకు నాడా మొగ్గుచూపుతోందని తెలుస్తోంది. ఈ మొత్తం డోపింగ్‌ నిరోధక కార్యకాలాపాలను నిర్వహించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన మూడు బృందాలను నాడా నియమించనుంది. నాడా సీనియర్‌ అధికారి, డీసీవో కేంద్రాల నుంచి ఇద్దరు, యూఏఈ యాంటీడోపింగ్ సభ్యులు ఇద్దరు ఇందులో సభ్యులుగా ఉంటారు. విడతలవారీగా ఈ బృందాలు యూఏఈ చేరుకొని పరీక్షలు చేస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news