అగ్రశ్రేణి ఔషధ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.579 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్ రూ.34.86 ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో నమోదైన రూ.662 కోట్ల నికరలాభంతో పోలిస్తే ఈసారి నికరలాభం 13 శాతం తగ్గడం గమనార్హం. కానీ అదే సమయంలో త్రైమాసిక ఆదాయం మాత్రం 15 శాతం పెరిగింది. ప్రస్తుత మొదటి త్రైమాసికానికి ఆదాయం రూ.4,418 కోట్లు నమోదు కాగా, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇదేకాలంలో ఆదాయం రూ.3,843 కోట్లు మాత్రమే.
అతిపెద్ద ఫార్మసీ మార్కెట్ అయిన ఉత్తర అమెరికాలో డాక్టర్ రెడ్డీస్ ఆదాయాలు ఈ మొదటి త్రైమాసికంలో 6 శాతం పెరిగాయి. అక్కడ మార్కెట్లో ఆరు కొత్త ఔషధాలు విడుదల చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. అంతేగాక యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి కోసం అయిదు ఔషధాలకు సంబంధించి ఏఎన్‌డీఏ దరఖాస్తులు దాఖలు చేసినట్లు పేర్కొంది. దీంతో యూఎస్‌ఎఫ్‌డీఏ వద్ద 99 ఏఎన్‌డీఏ దరఖాస్తులు చేసినట్లు అవుతోంది. ఇందులో 54 దరఖాస్తులు పారా-4 తరగతికి చెందినవి కాగా, 28 ఔషధ దరఖాస్తులకు ‘ఫస్ట్-టు-ఫైల్’ అర్హత ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ మొదటి త్రైమాసికంలో రష్యా అమ్మకాలు 17 శాతం క్షీణించాయి. కొవిడ్-19 ప్రభావం దీనికి కారణమని కంపెనీ విశ్లేషించింది. దేశీయ మార్కెట్లోనూ అమ్మకాలు 10 శాతం తగ్గాయి. సీఐఎస్ దేశాలు, రుమేనియాలో మాత్రం 15 శాతం వృద్ధి నమోదైంది. ఐరోపా అమ్మకాలు కూడా పెరిగాయి. స్థూల లాభాల శాతం కొంత పెరిగి 56 శాతానికి చేరినట్లు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాలపై రూ.400 కోట్లు వెచ్చించారు. త్రైమాసిక ఆదాయంలో ఇది 9 శాతానికి సమానం.