ఈ సారి రాష్ట్రపతి ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. అధికార బీజేపీకి పోటీగా విపక్షాలు కూటమి కూడా బరిలోకి అభ్యర్థిని దించింది. అయితే ఈ నేపథ్యంలో.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపదీ ముర్ము నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి ఆమె నామినేషన్ ప్రతాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు.
మొదటగా ప్రధాని మోడీ.. ముర్ము పేరును ప్రతిపాదిస్తారు. నామినేషన్ పత్రాలను 50 మంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ప్రతిపాదించి, మరో 50 మంది బలపరచాల్సి ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమె గెలిస్తే దేశంలో అత్యున్నత రాజ్యాంగబద్ధ పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. ప్రతిభాపాటిల్ తర్వాత రాష్ట్రపతి పదవి చేపట్టిన రెండో మహిళగా నిలవనున్నారు.