అతి సర్వత్ర వర్జయేత్ అని పెద్దలు అన్నారు. అంటే.. దేన్నీ అతిగా తీసుకోరాదు. మంచి చేస్తాయని చెప్పి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అవి మంచి చేయకపోగా అనారోగ్య సమస్యలను తెచ్చి పెడతాయి. ఈ విషయం తెలిసీ కొంత మంది కొన్ని ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. దీంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ప్రజల్లో దానిపట్ల అవగాహన పెరిగింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మాస్కులు ధరించడం, సోషల్ డిస్టన్స్ పాటించడం, శానిటైజర్లు వాడడం వంటి పనులు చేస్తున్నారు. ఇక శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు కషాయాలు, హెర్బల్ టీ ల వంటివి తాగుతున్నారు. అంత వరకు బాగానే ఉంది. కానీ వీటిని అతిగా తీసుకుంటున్నారని తేలింది. ఈ క్రమంలో హెర్బల్ ఉత్పత్తులను అతిగా వాడుతున్నవారి లివర్ చెడిపోతుందని వైద్యులు చెబుతున్నారు.
కరోనా వస్తుందేమోనని భయపడి కొందరు అతిగా కషాయాలను తాగుతున్నారు. రోజుకు 4 నుంచి 6 సార్లు హెర్బల్ ఉత్పత్తులను తీసుకుంటున్నారు. తిప్పతీగ కషాయాన్ని ఎక్కువగా తాగుతున్నారు. అయితే అలా అతిగా కషాయాలను తాగిన వారి లివర్ చెడిపోతుందని, అలాంటి వారిలో కొందరికి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యులు తెలిపారు. అతిగా కషాయాలను తాగే వారిలో 40 శాతం మందికి లివర్ దెబ్బ తిన్నదని తెలిపారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 700కు పైగా ఇలాంటి కేసులు వచ్చాయని వెల్లడైంది. వారందరూ హెర్బల్ ఉత్పత్తులను అతిగా వాడారని తేలింది. దేశంలో సుమారుగా 30వేలకు పైగా హెర్బల్ ఉత్పత్తులను అమ్మే బ్రాండ్స్ ఉన్నాయి. అయితే సహజసిద్ధమైనవని వారు చెబుతున్నప్పటికీ దేన్నీ అతిగా తీసుకోరాదు. ఏదైనా సరే అతిగా తీసుకుంటే అనర్థాలే వస్తాయి. అందుకు ఇదే ఉదాహరణ అని చెప్పవచ్చు.