చర్మ సమస్యలనేవి ఒక పట్టాన పోయేవి కావు. చర్మానికి ఏ చిన్న సమస్య వచ్చినా అంత తొందరగా తొలగిపోదు. అదీగాక మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మమే కాబట్టి, చర్మానికి ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. రుతువు మారినప్పుడల్లా చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే చర్మ సంరక్షణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. మార్కెట్లో దొరికే చాలా సాధనాలు చర్మ సంరక్షణకి తోడ్పడతాయి. అవేగాక మనం తీసుకునే ఆహారాలు, వ్యాయామం మొదలగునవి చర్మానికి ఆరోగ్యాన్ని తీసుకొస్తాయి. చాలా మందికి తెలియని డ్రై బ్రషింగ్ అనే కాన్సెప్ట్ చర్మ సంరక్షణకి తోడ్పడే విధానం.
డ్రై బ్రషింగ్ గురించి మీకు తెలియని విషయాలు..
పొడి బ్రష్ తో చర్మంపై దువ్వుకోవడమే డ్రై బ్రషింగ్. దీనివల్ల చర్మం ఉండే మలినాలు తొలగిపోయి ఆరోగ్యంగా తయారవుతుంది. డ్రై బ్రషింగ్ చేయడానికి సమయం అంటూ ఉండదు. స్నానానికి ముందైనా. స్నానం చేసిన తర్వాతైనా డ్రై బ్రషింగ్ చేసుకోవచ్చు. పాదం నుండి మొదలెట్టి, పైకి వస్తూ గుండ్రంగా చుట్లు తిప్పుతూ శరీరం మొత్తం చేయాలి. చర్మం దళసరిగా ఉన్న చోట అంటే పాదాలు, పొట్ట, అరచేతులు మొదలగు ప్రదేశాల్లో ఎక్కువసార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది.
డ్రై బ్రషింగ్ వల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనాల్లో ఒకటి శోషరస వ్యవస్థని మెరుగుపర్చడం. శరీరంలో అక్కడక్కడా నీరు ఆగి వాపు కలిగే సమస్యలని పొడి బ్రష్ ద్వారా బ్రషింగ్ చేయడంతో తొలగించవచ్చు. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తద్వారా చర్మ సమస్యలు తగ్గుతాయి. కావాలంటే మీరూ ఒకసారి ప్రయత్నించి చూడండి.