భారీగా పెరగనున్న హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం!

-

కరోనా నేపథ్యంలో హెల్త్‌ ఇన్సూరెన్స్ తీసుకునేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. కోవిడ్‌ వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారు కూడా పాలసీలను తీసుకుంటున్నారు. ఎప్పటికైన ఉపయోగపడుతుందనే అంచనా చాలా మందిలో కలిగింది. అయితే కోవిడ్‌ కారణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఎక్కువ మొత్తంలో క్లెయిమ్స్‌ చెల్లించాల్సి వస్తోంది.


దీనివల్ల హెల్త్‌ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబం మొత్తానికి తీసుకునే హెల్త్‌ ఇన్సూరెన్స్ వల్ల మెడికల్‌ ఖర్చులు చాలావరకు తగ్గుతాయి. కానీ ప్రీమియం పెరిగితే ఆ మేరకు వినియోగదారులు ఇన్సూరెన్స్ ఖర్చులు భారం కానున్నాయి. హెల్త్‌ ఇన్సూరెన్స్ ప్రీమియం పది శాతానికి పెంచాల్సి ఉంటుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. హెల్త్‌ ఇన్సూరెన్స్ స్కీమ్‌ కింద చికిత్స అందించాల్సిన జాబితాలో మరిన్ని వ్యాధులను చేర్చాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కంపెనీలను ఆదేశించింది.

ఈ ఫిబ్రవరిలో ఐఆర్‌డీఏఐ ఇన్సూరెన్స్ కంపెనీలకు మరో సూచన చేసింది. ఇండస్ట్రీ అంతటా వర్తించే స్టాండర్డ్‌ పర్సనల్‌ యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను ప్రజలకు అన్ని కంపెనీలు అందించాలని చెప్పింది. దీన్ని కంపెనీలు సరళ్‌ సురక్షా బీమా పేరుతో అందిచాలని పేర్కొంది. జనరల్, హెల్త్‌ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ప్రొడక్ట్‌ను ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని ఆదేశించింది.

ఫలితంగా పాలసీల్లో అనేక వ్యాధులను చేర్చాల్సి వస్తోంది. ప్రస్తుతం ఇన్సూరెన్స్ కంపెనీలు రూ.14,000 కోట్ల వరకు కోవిడ్‌–19 క్లెయిమ్‌లను పరిష్కరించాల్సి ఉంది. మహమ్మారి వల్ల ఎక్కువ క్లెయిమ్స్‌ వచ్చాయి. ఈ మేరకు కంపెనీలు నష్టపోయాయి. అంతేకాకుండా మెడికల్‌ ఇన్ ఫ్లేషన్‌ కూడా పెరిగింది. వీటి ఫలితంగా కంపెనీలు హెల్త్‌ ఇన్సూరెన్స్ ప్రీమియంలను 10 శాతం వరకు పెంచాలని నిర్ణయించాయి.

గత ఏడాది అక్టోబరు 1 నుంచి హెల్త్‌ ఇన్సూరెన్స్ కవరేజీ పెరిగింది. ఎన్నో రకాల వ్యాధులు కూడా ఇన్సూరెన్స్‌ జాబితాల్లో చేరాయి. పాలసీ వర్తించని శాశ్వత అనారోగ్యాల సంఖ్య ఇంతకు ముందు 30 ఉండగా.. ప్రస్తుతం 17కు చేరింది. అంటే ఇప్పుడు కేవలం 17 రకాల వ్యాధులకే హెల్త్‌ ఇన్సూరెన్స్ నుంచి మినహాయింపు ఉంటుంది. మిగతావన్నీ పాలసీ కవరేజీ కిందకు వస్తాయి. దీనికి తోడు మానసిక సమస్యలు, నరాల సమస్యలు.. వంటి తీవ్రమైన వ్యాధులకు ఇన్సూరెన్స్ పాలసీ నుంచి మినహాయింపు ఉండదు. ప్రీమియం విలువ పెరగడానికి ఈ కారణాలు కూడా దోహదం చేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news