పవన్ ను తిడితే హీరోలు కారు ..
జనంలో ఉండి పనిచేస్తేనే ఎవ్వరయినా
హీరోలు కాగలరు
ప్రజలకు అందాల్సినవి అందిస్తే
మత్స్యకార గ్రామాల దాహార్తి తీరిస్తే
పవన్ కాదు ద్వారంపూడి చంద్రశేఖరే
హీరో అవుతారు
అధికారంలో ఉండి చేయాల్సిందేదో చేస్తే
ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తే హీరో
పవన్ కాదు చంద్రశేఖర్ మాత్రమే!
ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ప్రజలదే ! తప్పక ప్రజలే బుద్ధి చెబుతారు.. అంటూ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఉద్దేశించి జనసేన వ్యాఖ్యలు చేస్తోంది. గత కొద్ది కాలంగా ద్వారంపూడి వర్గానికి,పవన్ వర్గానికి మధ్య గొడవలు జరుగుతున్నాయి.ఇవే ఇప్పుడు తీవ్రస్థాయికి చేరి వాగ్యుద్ధానికి దారి తీస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ద్వారంపూడి మాట్లాడడం, తూర్పుగోదావరి జిల్లాలో పవన్ ఎక్కడ పోటీచేసినా, ఆయనను ఓడిస్తానని చెప్పడం ఇవన్నీ రాజకీయ తగాదాలకు తావిస్తున్నాయి. ఇవే ఇప్పుడు మరిన్ని తగాదాలకూ కారణం అయి ప్రశాంత గోదావరి తీరంలో అలజడులకు దారి తీస్తున్నాయి. దోహదం అవుతున్నాయి. వాస్తవానికి ఎప్పటి నుంచో పవన్ తరఫు మనుషులు తూర్పు గోదావరి జిల్లాలో పాగా వేయాలని చూస్తున్నారు.
పవన్ కూడా తమ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న తూగో మరియు పగోలలో పట్టు పెంచుకునేందుకు చూస్తున్నారు. ఈ రెండు జిల్లాలలో ఇంకా బాగా పట్టున్న శెట్టి బలిజ సామాజికవర్గాన్ని కూడా తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు పవన్. కాపు, శెట్టి బలిజ తో పాటు క్షత్రియ ప్రాభవం ఉన్న జిల్లాలు కావడంతో వారిని కూడా తమలోనే కలుపుకునేందుకు పవన్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.ఇవేవీ కూడా ద్వారంపూడికి నచ్చని పనులు కావడంతో ఆయన తనదైన తరహాలో పవన్ ను తిట్టి పోస్తున్నారు. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా పవన్ ను లక్ష్యంగా చేసుకుని తిట్ల దండకం అందుకుంటున్నారు.
వాస్తవానికి పవన్ కు మంచి పట్టున్న ఆ రెండు జిల్లాలలో వైసీపీకి ఓటమి భయం ఉండనే ఉంది. మొన్నటి ఎన్నికల్లో కూడా టీడీపీ,జనసేన వేర్వేరుగా పోటీచేయడం వల్లే వైసీపీ నెగ్గుకు వచ్చింది. అది కూడా చాలా చోట్ల స్వల్ప మెజార్టీ తేడాతో జగన్ మనుషులు గెలుపును తమ ఖాతాలో వేసుకునేందుకు చివరి దాకా పోరాడారు.పోరాడాల్సి వచ్చింది కూడా! ఇదే సమయంలో మిగిలిన పార్టీలు కూడా జగన్ కన్నా జనసేనకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఓట్లు రాకున్నా సీట్లు గెలవకున్నా ప్రజాక్షేత్రంలో జగన్ కన్నా కొన్ని సందర్భాల్లో పవన్ కే ఎక్కువ క్రేజ్ ఉంది.ఇందుకు మొన్నటి జనసేన ఆవిర్భావ సభే తార్కాణం.
ఇవన్నీ ద్వారంపూడిని విపరీతంగా గందరగోళ పరుస్తున్నాయి.
మరోవైపు ఆయనపై చాలా సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని కూడా జనసేన ప్రచారం చేస్తోంది. పేద ప్రజలకు పౌర సరఫరాల శాఖ ద్వారా అందించాల్సిన బియ్యాన్ని పోర్టు ద్వారా దేశం దాటిస్తున్నారన్న ఆరోపణలు కూడా తీవ్రం చేసింది జనసేన. ఇవన్నీ ద్వారంపూడిని ఇబ్బంది పెడుతున్నాయి.అందుకే జనసేన పేరు చెబితే చాలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అదే పనిగా పవన్ ను తిడుతూ తిడుతూ తనని తాను తగ్గించుకుంటున్నారు.