దేశవ్యాప్తంగా మూడో విడత లాక్‌డౌన్‌ను మే 17వ తేదీ వరకు పొడిగించిన విషయం విదితమే. శుక్రవారం సాయంత్రమే ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఆ ప్రకటన విడుదల చేసింది. ఇక దీంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అదనంగా మరిన్ని ఆంక్షలను సడలించింది. ఈ క్రమంలోనే ఆ రెండు జోన్లలో నాన్ ఎసెన్షియల్ వస్తువులను డెలివరీ చేసేందుకు కూడా అనుమతి ఇచ్చింది. దీంతో దేశంలోని గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర ఈ-కామర్స్ సంస్థలు మళ్లీ తమ సర్వీసులను పునః ప్రారంభించనున్నాయి.
అయితే రెడ్ జోన్లలో ఈ-కామర్స్ సంస్థలు మాత్రం యథావిధిగా కేవలం నిత్యావసరాలను మాత్రమే డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, ముంబై తదితర ప్రదేశాల్లో రెడ్ జోన్లు ఇప్పటికే ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఈ-కామర్స్ సంస్థలు నాన్ ఎసెన్షియల్ వస్తువులను డెలివరీ చేసేందుకు అనుమతి లేదు. దీంతో ఒక మోస్తరు నగరాలు, పట్టణాల్లోనే ఆయా సంస్థలు సదరు వస్తువులను డెలివరీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
కాగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో క్యాబ్ సర్వీసులు నడుపుకునేందుకు కూడా అనుమతినిచ్చారు. కాకపోతే కారులో డ్రైవర్‌తోపాటు ఒక్కరే ప్రయాణికుడు ఉండాలి.