ప్రపంచంలో చాలా మంది మాంసాహార ప్రియులు ఉన్నప్పటికీ వారిలో చికెన్ తినేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కొందరు కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే చికెన్ తెచ్చుకుని తింటే.. కొందరికి చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగదు. అలాంటి వారు 2 లేదా 3 రోజులకు ఒక్కసారైనా చికెన్ తింటుంటారు. ఈ క్రమంలోనే ఎవరైనా సరే.. చికెన్ సెంటర్ బిజినెస్ పెడితే.. దాన్ని స్వయం ఉపాధికి చక్కని మార్గంగా మలుచుకోవచ్చు. కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటూ.. వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకువస్తే.. నెల నెలా రూ.వేలు మొదలుకొని లక్షల వరకు సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ బిజినెస్‌కు ఎంత పెట్టుబడి అవసరం అవుతుందో.. ఇందులో ఏ మేర ఆదాయం వస్తుందో.. ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ సెంటర్ బిజినెస్‌కు 10 * 10 వైశాల్యం ఉన్న ఓ చిన్న గది అయినా చాలు.. అదే పెద్దగా బిజినెస్ చేయాలనుకుంటే పెద్ద షటర్లను అద్దెకు తీసుకోవాలి. ఇక జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశంలో బిజినెస్ బాగా జరుగుతుంది కనుక.. అలాంటి ఏరియాల్లో చికెన్ సెంటర్ పెట్టాలంటే.. గదుల అద్దెలకు, అడ్వాన్స్‌కు ఎక్కువ మొత్తం వెచ్చించాలి. అలా కాకుండా ఒక మోస్తరు ఏరియాల్లో పెట్టాలన్నా.. ముందుగా కనీసం రూ.10వేలు మొదలుకొని రూ.50వేల వరకు గదికి అడ్వాన్స్ ఇవ్వాలి. ఈ క్రమంలో ఎవరైనా.. తమ ఆర్థిక శక్తిని బట్టి గదులను అద్దెకు తీసుకుని అడ్వాన్స్ చెల్లించి.. చికెన్ సెంటర్ బిజినెస్ చేయవచ్చు. అయితే ఈ బిజినెస్‌కు ఎంత లేదన్నా కనీసం రూ.25వేల నుంచి రూ.50వేల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది.
చికెన్ సెంటర్ పెట్టేందుకు గదితోపాటు అందులో సామగ్రి కూడా అవసరమే. చికెన్‌ను శుభ్రం చేసే మెషిన్, బర్నింగ్ మెషిన్, గ్యాస్ సిలిండర్, చికెన్ కొట్టేందుకు కత్తి, మొద్దు, స్టవ్, ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్ వంటి వాటని కొనుగోలు చేయాలి. అవన్నీ అమరాక.. కోళ్లను హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి వాటిని విక్రయించాల్సి ఉంటుంది. మార్కెట్‌లో సాధారణంగా 2.50 కిలోల బరువున్న ఒక కోడి హోల్‌సేల్ ధర రూ.225 వరకు ఉంటుంది. దాన్ని కట్ చేసి క్లీన్ చేస్తే అర కిలో వృథా అవుతుంది. దీంతో 2 కిలోల కోడిని కిలో రూ.180 చొప్పున రూ.360కి అమ్మవచ్చు. అందులోంచి కోడి ఖర్చు రూ.225 తీసేస్తే… 360 – 225 = 135 అవుతుంది. రూ.135 మనకు 2 కిలోల కోడి మీద వచ్చే ఆదాయం అన్నమాట. అందులో సగం అంటే.. రూ.67 మనకు 1 కిలో కోడి మీద వచ్చే ఆదాయం.
ఇక నిత్యం 25 కిలోల కోళ్లను అమ్మితే.. 25 * 67 = రూ.1675 వస్తుంది. నెలకు 30 * 1675 = రూ.50,250 వస్తుంది. అందులోంచి కరెంటు ఖర్చు, అద్దె తదితర ఖర్చులు రూ.10వేలు తీసేసినా.. రూ.40వేల వరకు లాభం వస్తుంది. ఇక బిజినెస్ బాగా జరిగితే ఇంతకన్నా ఎక్కువగానే సంపాదించేందుకు వీలు కలుగుతుంది. అయితే చికెన్ సెంటర్‌ను చాలా శుభ్రమైన వాతావరణంలో నిర్వహించాలి. దాంతో కస్టమర్లు ఎక్కువగా వస్తారు. అలాగే నగదుతోపాటు డిజిటల్ పేమెంట్లను కూడా యాక్సెప్ట్ చేసే వెసులు బాటు కల్పించాలి. దీంతో చికెన్ సెంటర్‌కు వచ్చిన కస్టమర్ వెనక్కి వెళ్లకుండా ఉంటాడు. అలాగే చికెన్‌ను బరువు కొలిచేందుకు కేవలం ఎలక్ట్రానిక్ వెయిట్‌నే వాడాలి. సాధారణ తూకం అయితే.. షాపు వారు తమను మోసం చేస్తున్నారని కస్టమర్లు భావించేందుకు అవకాశం ఉంటుంది. కనుక అలాంటి వారు కూడా షాపుకు రావాలంటే.. ఎలక్ట్రానిక్ వెయిట్‌ను చికెన్ బరువు కొలిచేందుకు వాడాలి.
సాధారణంగా చికెన్ సెంటర్ బిజినెస్ అన్ని రోజుల్లోనూ బాగానే ఉంటుంది. అయితే ఒక్కోసారి వేసవిలో లేదా వర్షాకాలంలో, శ్రావణ మాసం, కార్తీక మాసం వంటి సమయాల్లో.. లేదా.. హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న రోజుల్లో.. ఈ బిజినెస్ సరిగ్గా జరగకపోవచ్చు. అయినప్పటికీ.. చికెన్ సెంటర్ బిజినెస్ ఎవర్ గ్రీన్ బిజినెసే.. ముందు తెలిపిన కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో తప్పితే.. మిగిలిన రోజుల్లో ఈ బిజినెస్ ద్వారా చక్కని ఆదాయం సంపాదించవచ్చు..!