2020 సంవత్సరంలో మునుపెన్నడూ చూడని అత్యంత భయంకర పరిస్థితులను చూస్తున్నాం. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి అమెరికా ప్రెసిడెంట్ నుండి అమలాపురం వార్డ్ మెంబర్ వరకు ఎవ్వరినీ విడవట్లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలా కుతలమైంది, ఎడ్యుకేషన్ ఆగిపోయింది, నిరుద్యోగులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఇది చాలదన్నట్లు 2020 సంవత్సరం చివరినాటికి మరో విపత్తు భారత్‌కు పొంచి ఉందని, అతి పెద్ద భూకంపం హిమాలయాల ప్రాంతంలో రానుందని పరిశోధకులు వెల్లడించారు.
హిమాలయాలు మన దేశ ఉత్తర సరిహద్దులో రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుంచి వచ్చే చల్లటి గాలులను అడ్డుకుంటూ ‘రుతు పవన తరహా శీతోష్ణస్థితి’ కి కారణంగా నిలుస్తుంది. దేశానికి కిరీటంగా పిలవబడే హిమాలయాల్లో భూ కంపం సంభవించే అవకాశాలున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. జర్నల్ ఆఫ్ సీస్మోలాజికల్ రీసెర్చ్ లెటర్స్ లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. భౌగోళిక, చారిత్రక మరియు భౌగోళిక డేటా పరిగణలోకి తీసుకున్నారు, పర్వత ఉపరితలాలను మరియు మట్టిని పరిశీలించినట్లు జర్నల్ ఆఫ్ సీస్మోలాజికల్ రీసెర్చ్ లెటర్స్ లో ప్రచురించారు.
ఈ పరిశోధనలో కీలకంగా ఉన్న పరిశోధకుడు స్టీవెన్ జి. వోస్నోస్కి మాట్లాడుతూ, హిమాచల్ ప్రాంతం తూర్పున భారతదేశానికి మరియు పశ్చిమాన పాకిస్తాన్ వరకు విస్తరించి ఉంది, కాబట్టి దాని ప్రభావం రెండు దేశాలకు ఉండవచ్చని, గతంలో సంభవించిన భూకంపాలకు ఈ ప్రాంతం అనేక పెద్ద భూకంపాలకు కేంద్రంగా ఉందని అన్నారు.
ఒక వేళ ఇంతటి విపత్తు సంభవించినట్లయితే, భారతదేశంలోని చండీగఢ్ మరియు డెహ్రాడూన్ మరియు నేపాల్ లోని ఖాట్మండు వంటి పెద్ద నగరాలు ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.