సూపర్ మార్కెట్‌కు వెళ్లారంటే చాలు… ఎవర్ని చూసినా బుట్టల కొద్దీ చిప్స్, చిరుతిండి ప్యాకెట్లు కొనుక్కుని వెళ్తుంటారు. అలా కొన్న చిప్స్‌ను గంటల తరబడి అదే పనిగా తింటూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలకు చిప్స్ అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వారు ఎన్ని తింటున్నాం, ఏం తింటున్నాం అని.. ఆలోచించకుండా తినేస్తుంటారు. అయితే ఇలా చిప్స్ తినడం చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. చిప్స్ బాగా తినడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయని వారు అంటున్నారు.
హాట్ చిప్స్‌ను ఎక్కువగా తినడం వల్ల చాలా మందికి కడుపు నొప్పి, వాంతులు, మూత్రం, మలంలో రక్తం పడడం వంటి సమస్యలు వస్తున్నాయట. అలాగే గుండెల్లో మంట రావడం, తీవ్రమైన అసిడిటీ సమస్యలు కూడా వస్తున్నాయట. ఇటీవలి కాలంలో ఇలా చిప్స్ తిని ఆయా అనారోగ్య సమస్యల బారిన పడి హాస్పిటల్స్‌కు వస్తున్న వారి సంఖ్య కూడా బాగా పెరుగుతుందట. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఇలా బాగా చిప్స్ తిని అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
ప్రస్తుతం మనకు మార్కెట్‌లో రక రకాల చిప్స్ లభిస్తున్నాయి. అనేక రకాల భిన్నమైన ఫ్లేవర్లతో వాటిని తయారు చేస్తున్నారు. అయితే ఏ తరహా చిప్స్ అయినా సరే.. వాటిని అతిగా తింటే సమస్యలు కొని తెచ్చుకున్న వారవుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిప్స్ ను బాగా తినే వారికి అల్సర్, మధుమేహం, అధిక బరువు వంటి సమస్యలు వస్తాయని, కనుక ఆ సమస్యలను కొని తెచ్చుకోవడం కంటే వాటిని తినకుండా ఉండడమే మేలని వారు అంటున్నారు. కనుక ఇకనైనా మేల్కొనండి. తల్లిదండ్రులైతే పిల్లలకు చిప్స్ తినే అలవాటును మాన్పించండి. లేదంటే.. అనవసరంగా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్న వారవుతారు.