మిల్లెట్స్ (చిరు ధాన్యాలు) తినడం వల్ల అనేక అద్భుతమైన లాభాలు కలుగుతాయన్న సంగతి తెలిసిందే. వాటి వల్ల మన శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. ఫైబర్ ఎక్కువగా అందుతుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. అలాగే అధిక బరువు తగ్గవచ్చు. డయాబెటిస్, ఇతర అనారోగ్య సమస్యల నుంచి బయట పడేందుకు అవకాశం ఉంటుంది. అయితే మిల్లెట్స్‌ను తినడం వల్ల కరోనా రాదనే ఓ మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఇందులో నిజం ఉందా..? అంటే…
మిల్లెట్స్‌ను తినడం వల్ల కరోనా రాదని, వచ్చినా ఏమీ చేయలేదని, ఆరోగ్యంగా ఉండవచ్చని.. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు మిల్లెట్స్‌ను ఎక్కువగా తింటున్నందువల్లే ప్రస్తుతం గ్రామాల్లో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయని.. ఓ మెసేజ్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని అనేక మంది షేర్ చేస్తున్నారు కూడా. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదని వెల్లడైంది. మిల్లెట్స్‌కు, కరోనాకు సంబంధం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
చిరు ధాన్యాలను తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరిగే మాట వాస్తవమే అయినప్పటికీ, వాటిని తినడం వల్ల కరోనా రాదని అనుకుంటే పొరపాటు పడినట్లేనని, కరోనాకు, చిరుధాన్యాలను తినడానికి సంబంధం లేదని అంటున్నారు. అలాగే ఏ వ్యక్తికి అయినా సరే కరోనా సోకినా, సోకకున్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలని అంటున్నారు. ఇక దేశంలో ప్రస్తుతం పట్టణాలు, నగరాల కన్నా గ్రామాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, కనుక సోషల్ మీడియాలో ఈ విషయంపై వచ్చే వార్తలను నమ్మకూడదని హెచ్చరిస్తున్నారు.