ఎడిట్ నోట్: కారులో ‘రైతు’?

-

ఎన్నికల సమయం ఆసన్నమైంది. ఇంకా పార్టీలు ఓటర్లని ఆకర్షించే దిశగా పనీమొదలుపెట్టారు. తెలంగాణలో మళ్ళీ పాగా వేయాలని ఓ వైపు కే‌సి‌ఆర్ ప్రయత్నిస్తుంటే..కే‌సి‌ఆర్‌కు చెక్ పెట్టి అధికారంలోకి రావాలని కాంగ్రెస్, మరోవైపు బి‌జే‌పి ప్రయత్నిస్తున్నాయి. ఇక ఎవరి ఎన్నికల వ్యూహాలు వారికి ఉన్నాయి. అయితే అధికారంలో ఉండటం వల్ల బి‌ఆర్‌ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది. కావల్సిన పనులు చేసి ఓటర్లని ఆకర్షించవచ్చు.

ఇప్పుడు ఆ దిశగానే కే‌సి‌ఆర్ ముందుకెళుతున్నారు. ఇప్పటికే దళితబంధు, బి‌సి, మైనారిటీలకు సాయం పేరిట కీలక పథకాలు ప్రకటించారు. అటు దివ్యాంగుల పెన్షన్ పెంచారు. ఇలా ఒకటి ఏంటి అనేక కీలక పథకాలు అమలు చేస్తున్నారు. ఇక యువతని ఆకట్టుకునేలా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఇదే క్రమంలో రైతులని ఆకట్టుకోవడానికి కే‌సి‌ఆర్ పనిచేయడం మొదలుపెట్టారు. వాస్తవానికి రైతు బంధు ఇచ్చిన సరే అనుకున్న మేర రైతులు బి‌ఆర్‌ఎస్‌కు పాజిటివ్ గా లేరు. ఎందుకంటే 2018 ఎన్నికల ముందు కే‌సి‌ఆర్ రైతు రుణమాఫీ హామీ ఇచ్చారు.

లక్ష లోపు రుణాలని మాఫీ చేస్తానని అన్నారు. కానీ 50 వేల లోపు రుణాలని మాఫీ చేశారు. దీంతో లక్ష లోపు రుణాలు ఉన్న రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. కే‌సి‌ఆర్ మాఫీ చేస్తారని వడ్డీలు కూడా కట్టలేదు. దీంతో లక్ష లోపు రుణాలు ఉన్న దాదాపు 30 లక్షలు పైనే ఉన్న రైతులు ఇబ్బంది పడ్డారు. పైగా బ్యాంకులు  సుమారుగా 20 లక్షల మంది బ్యాంకు ఖాతాలను నిలిపివేశాయి. అప్పుల బాధ తాళలేక కొంతమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో ఈ విషయంలో కే‌సి‌ఆర్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత నెలకొంది.

30 లక్షల రైతులు అంటే మాటలు కాదు..దెబ్బకు గెలుపోటములు తారుమారు అయిపోతాయి. అందుకే కే‌సి‌ఆర్ అలెర్ట్ అయ్యారు. ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 45 రోజుల్లో రైతు రుణమాఫీ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే రుణమాఫీ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేయాలని కే‌టి‌ఆర్ పిలుపునిచ్చారు.

అయితే ఈ రుణమాఫీ వల్ల రైతులు..కారు పార్టీకి పూర్తి మద్ధతు ఇస్తారా? అంటే చాలావరకు మద్ధతు దక్కే ఛాన్స్ ఉంది. కానీ కొందరు..ఎన్నికల ముందు చేసే రుణమాఫీని ఎంతవరకు నమ్ముతారో చెప్పలేం. చూడాలి మరి ఈ సారి రైతులు ఏ పక్షాన నిలుస్తారో.

Read more RELATED
Recommended to you

Exit mobile version