ఇకపై బీజేపీ యుద్ధమే అంటూ మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏకంగా తన కూతురు కవితనే పార్టీ మారమని అడిగారని, ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా అని తాజాగా జరిగిన టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో బీజేపీపై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై కేసిఆర్ చర్చించారు. ఫాంహౌస్‌కు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలని తనతో పాటే సమావేశానికి తీసుకొచ్చారు.
ఈ సమావేశం మొత్తం బీజేపీ టార్గెట్‌గా సాగిందనే చెప్పాలి..వాస్తవానికి ఎక్కడ తమ ఎమ్మెల్యేలని బీజేపీ లాగేసుకుంటుందనే భయం కేసీఆర్‌లో కనిపించింది..కానీ పైకి మాత్రం నెక్స్ట్ మనదే గెలుపు 95 సీట్లు మనవే అంటూ ఎమ్మెల్యేలకు అభయం ఇచ్చారు. అందులో భాగంగానే ముందస్తు ఎన్నికలు ఉండవని, షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది డిసెంబరులోనే ఎన్నికలు ఉంటాయని స్పష్టత ఇచ్చారు. సిటింగ్ ఎమ్మెల్యేలందరికీ ఈసారి కూడా టికెట్లు ఖాయమని భరోసా ఇచ్చారు.
అంటే సిట్టింగులకు సీటు లేదంటే వారు జంప్ అయిపోతారనే భయం ఉందని చెప్పొచ్చు. కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలపై ఈడీ దాడులుంటాయని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు. ఇక ఇలా చెప్పాకే ఎమ్మెల్యేల్లో భయం పెరిగిందని చెప్పొచ్చు. ప్రతి నియోజకవర్గంలోను ప్రతి 100 మంది ఓటర్లకు ఒక ఇన్‌ఛార్జిని నియమించాలని కోరారు.
ఇక ఈడీ దాడులు చేస్తే తిరగబడాలని, కమలం పార్టీకి ఎక్కడక్కడ కౌంటర్లు ఇవ్వాలని, కమలం నేతలు ఒక మాట అంటే.. నాలుగు మాటలు అనాలని, బీజేపీ రూపంలో దేశానికి పట్టిన చెదను వదిలించాల్సిన బాధ్యత మనపై ఉందని, ఆ పార్టీ వికృత చేష్టలను ఎండగట్టాలని, ప్రతి ఒక్కరూ ఒక్కో కేసీఆర్‌లా మారి నిలబడి కలబడాలని చెప్పి ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పారు.
అదేసమయంలో పోడు భూముల సమస్యల కూడా పరిష్కరిద్దామని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కథ అయిపోయిందని, ఆ పార్టీది ముగిసిన అధ్యాయనం అన్నారు. మొత్తానికి బిజేపి టార్గెట్‌గానే కేసిఆర్ సమావేశం నిర్వహించారు. పైకి ఏదో భయపడటనట్లు మాట్లాడరు గాని, ప్రతి మాటలోనూ బిజేపికి భయపడినట్లే కనిపిస్తోంది. అందుకే అంతలా బిజేపిని టార్గెట్ చేశారు. మరి ఇక నుంచి టిఆర్‌ఎస్-బిజేపి వార్ ఎలా ఉంటుందో చూడాలి.