ఎడిట్ నోట్: పవన్ ‘వారాహి’..!

-

ఎన్నికల యుద్ధానికి పవన్ సిద్ధమయ్యారు. తన వారాహి వాహనంతో ఎన్నికల రంగంలోకి దిగనున్నారు. ఇంతకాలం అప్పుడప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తూ వచ్చిన పవన్..ఇకపై పూర్తిగా రాజకీయ యుద్ధ బరిలో దిగుతున్నారు. ఇంతవరకు పవన్ ఏపీకి అప్పుడప్పుడు వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేయడం గాని, వైసీపీ ప్రభుత్వం టార్గెట్ గా విరుచుకుపడటం గాని చేస్తూ వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ కు వెళ్ళి తన సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉండేవారు. దీంతో ఏపీలో మళ్ళీ పవన్ టాపిక్ వచ్చేది కాదు.

అక్కడ వైసీపీ-టీడీపీల మధ్యే వార్ ఇంకా తీవ్రమయ్యేది..ఈ వార్‌లో జనసేన వెనుకబడిపోతుంది. అయితే పవన్ రెగ్యులర్ గా రాజకీయాల్లో ఉంటే ఆ పరిస్తితి ఉండేది కాదు. కానీ ఇకనుంచి పవన్ అదే దిశగా ముందుకెళ్లనున్నారు. ఏపీలో బస్సు యాత్ర చేయడానికి రెడీ అయ్యారు. దీని కోసం ప్రత్యేకమైన బస్సు కూడా రెడీ చేశారు. తాజాగా ఆ బస్సు ఫోటోలని పవన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పూర్తి సెక్యూరిటీతో రెడీ అయిన ఈ బస్సుకు వారాహి అని పేరు కూడా పెట్టారు.

ఇక బస్సు ప్రత్యేకతలపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.  ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరుపెట్టారు. ఈ వాహనానికి తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించనున్నారు. వారాహి వాహనంపైనా… చుట్టుపక్కలా ప్రత్యేక లైటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. అటు వేలమందికి స్పష్టంగా వినిపించేలా అధునాతనమైన సౌండ్‌ సిస్టమ్‌ ఉంది.. భద్రతా కారణాలరీత్యా వాహనానికి నలువైపులా సీసీటీవీ కెమెరాలు పెట్టి దాని ఫుటేజ్‌ ప్రత్యేక సర్వర్‌కు రియల్‌ టైంలో చేరేలా ఏర్పాటు చేశారు. ఇలా అన్నీ ప్రత్యేక వసతులతో ఈ బస్సుని తయారు చేశారు. ఇక పవన్ బస్సు రెడీ కావడంతో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇంకా తమ నాయకుడు ప్రజల్లోనే ఉంటారని, జగన్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తారని అంటున్నారు.

అయితే బస్సు యాత్ర ఎప్పుడు మొదలవుతుందో అధికారికంగా డేట్ ఫిక్స్ కాలేదు. ఇదిలా ఉంటే అటు నారా లోకేష్ జనవరి 27 నుంచి పాదయాత్ర మొదలుపెడుతున్న విషయం తెలిసిందే. ఇటు లోకేష్ పాదయాత్ర, అటు పవన్ బస్సు యాత్రతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా నడిచే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్నికల యుద్ధంలో పవన్ ఎలా ముందుకెళ్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version