బీజేపీ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. తన ప్రస్తుత నియోజకవర్గం హుజూరాబాద్ తో పాటు, కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్ లోనూ బరిలో దిగుతానని ప్రకటించారు. హుజూరాబాద్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ లో కార్యకర్తలే అన్నీ నడిపించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో తాను ఎక్కడ తిరిగినా బ్రహ్మాండమైన మద్దతు ప్రజల నుండి వస్తుందని ,అయినా తాను హుజురాబాద్ గడ్డను మరవలేనని అన్నారు. హుజురాబాద్ నుంచి పోటీ చేస్తే కథానాయకులు మీరే కావాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో మాదిరి ఈసారి సైతం డబ్బుల సంచులతో బీఆర్‌ఎస్ నాయకులు వస్తారని, వారి మాటలకు, ప్రలోభాలకు లొంగకూడదని ఆయన కోరారు.
ప్రజల మద్దతు ఉన్న తాను నిరంతరం ప్రజల్లోనే ఉంటానన్నారు. తన గెలుపు చూసి ప్రజలు ఎవరైనా నాయకుడు కావచ్చు అని అనుకుంటున్నారని అన్నారు. డబ్బులు సంచులతో వచ్చిన ప్రజలు వారిని చీదరించుకున్నారని, ప్రజాబలం ముందు ఏ సంచులు నిలబడవని అన్నారు. ఈసారి తనను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ రెండేళ్ల కాలంలో ఎంత నరకం అనుభవించామన్నది మనకు తెలుసని ,ఈ బాధలు పోవాలంటే వచ్చే ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రజలు పట్టం కట్టాలని కోరారు.