దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. సోమవారం రాత్రి ఇక్కడ కుంభవృష్టి కురియడంతో పల్లపు ప్రాంతాల్లో నీరు చేరింది. ఈ వరదల్లో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందగా.. 14 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. చాలా చోట్ల రోడ్లపై కార్లు నీటమునిగిపోయాయి.
కొన్ని చోట్ల గత 80 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైనట్లు స్థానిక వాతావరణ శాఖ పేర్కొంది. మరికొన్ని రోజులపాటు వర్షపాతం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. కొన్ని వీధుల్లో భారీగా వరద నీరు చేరుతుండటంతో సహాయక చర్యలు కూడా చేపట్టలేని పరిస్థితి నెలకొంది.
ఓ ప్రాంతంలో వరద నీటిలో చిక్కుకున్న ఇంట్లో ఉన్న ముగ్గురిని రక్షించడం సిబ్బందికి సాధ్యం కాలేదు. నేటి ఉదయం ఈ ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని అధ్యక్షుడు యూన్ సందర్శించారు. సియోల్ సమీపంలోని ఇంచియాన్, గ్యాంగీల్లో గంటకు 10 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది. సియోల్‌లోని డాంగ్జాక్ జిల్లాలో గంటకు 141.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. 1942 నుంచి ఇదే అత్యధికం.
సియోల్‌లో భారీ వర్షపాతానికి రవాణా సౌకర్యాలు మొత్తం నిలిచిపోయాయి. నగరంలో రైల్వే సేవలు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యేల్ అధికారులను ఆదేశించారు.