రోజు రోజు దేశంలో అన్ని వస్తువుల ధరలు పెరిగి పోతున్నాయి. తాజాగా మరోసారి ఎలక్ట్రిక్ వస్తువుల ధరలు పెరుగనున్నాయి. టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మిషిన్ లాంటి ఎలక్ట్రిక్ వస్తువులు కొనాలనుకునే వారు త్వరపడండి. వీటి ధరలు 3 నుంచి 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ నెలాఖరులో కానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో కానీ ధరలు పెరగనున్నాయి. ఈ విషయం గురించి ఎలక్ట్రానిక్స్ తయారీదారుల సంఘం అధ్యక్షుడు ఎరిక్ బ్రగాంజా మాట్లాడుతూ.. ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల వీటి ధరలను పెంచక తప్పడం లేదని ఆయన వెల్లడించారు.
అమెరికా డాలరుతో పోలిస్తే మన రూపాయి విలువ మరింత పతనం కావడం వల్ల దిగుమతి చేసుకుంటున్న విడిభాగాలకు మరింత ఎక్కువ చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. ఈ కారణం వల్లే ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలను 3 నుంచి 5 శాతం వరకు పెంచాల్సి వస్తోందని తెలిపారు. పానాసోనిక్ ఇండియా సీఈవో మనీశ్ శర్మ మాట్లాడుతూ, వివిధ ఉత్పత్తుల ధరలను జనవరిలోనే కొంత మేర పెంచామని… ఇప్పుడు మరోసారి 4 నుంచి 5 శాతం వరకు పెంచక తప్పడం లేదని ఆయన పేర్కొన్నారు.