అమెరికాలో ప్రముఖ వీడియో యాప్ టిక్టాక్ నిషేధం ఉత్తర్వులపై సంస్థతోపాటు ఉద్యోగులూ కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పిటిషన్ రూపొందిస్తున్న న్యాయవాది మైక్ గాడ్విన్ ఈ విషయాలను వెల్లడించారు. టిక్టాక్ కంపెనీ, ఉద్యోగులు వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేయనున్నట్లు స్పష్టం చేశారు గాడ్విన్. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని వాదించనున్నట్లు తెలిపారు.
అయితే అమెరికాలోని 1,500 మంది ఉద్యోగులకు టిక్టాక్ జీతాలు చెల్లించటం చట్ట విరుద్ధమవుతుందా అనే అంశంపై స్పష్టత లేదు. అందుకే టిక్టాక్ ఉద్యోగులు న్యాయవాదిని ఆశ్రయించారు. ట్రంప్ ఆదేశాల ప్రకారం టిక్టాక్, దాని మాతృసంస్థ బైట్‌డాన్స్ చేసే ప్రతి లావాదేవీకి నిషేధం వర్తిస్తుంది.ప్రస్తుతం టిక్టాక్ ఉద్యోగుల జీవనోపాధి, జీతాలు ప్రమాదంలో పడ్డాయని గాడ్విన్ తెలిపారు. కార్మికుల హక్కులపైనే ఉద్యోగులు న్యాయపోరాటం చేస్తారని, ట్రంప్ పేర్కొన్న జాతీయ భద్రతపై కాదని స్పష్టం చేశారు.
ఉద్యోగుల పిటిషన్‌తో తమకు సంబంధం లేదని టిక్టాక్ తెలిపింది. కానీ, సంఘటితంగా పోరాడే వారి హక్కులను గౌరవిస్తామని స్పష్టం చేసింది. ట్రంప్ నిషేధం బెదిరింపుల నేపథ్యంలో టిక్‌టాక్‌ను బలవంతంగా దక్కించుకునేందుకు మైక్రోసాఫ్ట్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది సంస్థ.