జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.ఈ క్రమంలోనే కుప్వారాలోని గుగల్ ధార్ ప్రాంతంలో భద్రతాబలగాలు, ముష్కరుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.భద్రతాబలగాల కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ముష్కరులు గుట్టుగా దాక్కొని ఉన్నారనే సమాచారంతో శుక్రవారం భద్రతాబలగాలు, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. సెర్చ్ ఆపరేషన్ టైంలో ఉగ్రవాదులు కాల్పులు జరపగా..బలగాలు తిప్పికొట్టడంతో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
కుప్వారాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో శుక్రవారం ల్యాండ్‌మైన్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.‘ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని ట్రెహ్‌గామ్ ప్రాంతంలో గల నియంత్రణ రేఖ సమీపంలో ల్యాండ్ మైన్ పేలినట్లు అధికారులు గుర్తించారు.తెల్లవారుజామున పేలుడు సంభవించడంతో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు’ అని అధికారులు వెల్లడించారు. గాయపడిన ఆర్మీ సిబ్బందిని డ్రగ్ముల్లాలోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.