సుశాంత్‌ సింగ్‌ కేసు.. ఎన్‌సీబీ దర్యాప్తు ఆధారంగా మరో కేసు ఫైల్‌ చేయనున్న ఈడీ..?

-

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. సుశాంత్‌ సింగ్‌ తండ్రి కేకే సింగ్‌ బీహార్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ రంగంలోకి దిగింది. సుశాంత్‌ అకౌంట్లలో ఉండాల్సిన రూ.15 కోట్లను రియా, ఆమె కుటుంబ సభ్యులు తమ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారని సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ ఫిర్యాదు చేశారు. దీంతో ఈడీ ఈ విషయమై మనీ లాండరింగ్‌ జరిగి ఉండవచ్చని భావిస్తూ కేసు నమోదు చేసింది. అయితే సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో డ్రగ్స్‌ కోణం వెలుగులోకి రావడంతో ప్రస్తుతం ఎన్‌సీబీ ఆ కోణంలో దర్యాప్తు చేపట్టింది.

enforcement directorate may file fresh case on money laundering

అయితే నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఇప్పటికే రియాతోపాటు ఆమె సోదరుడు షౌవిక్‌, సుశాంత్‌ ఇంటి మేనేజర్‌ శామ్యూల్‌ మిరాండా, మరికొందరిని అరెస్టు చేసి విచారిస్తోంది. రియాను ఎన్‌సీబీ అరెస్టు చేసి మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచగా ఆమెకు ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు. అయితే సుశాంత్‌ సింగ్‌ కేసులో డ్రగ్స్‌ కోణం వెలుగులోకి వచ్చినందున, అందులో భాగంగా ఎన్‌సీబీ పలువురిని అరెస్టు చేసి విచారణ చేపట్టినందున.. ఈడీ ఈ విషయమై మరో కొత్త కేసును నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఎన్‌సీబీ అరెస్టుల నేపథ్యంలో సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో మరిన్ని వివరాలు తెలిశాయి. ఈ క్రమంలోనే సుశాంత్‌ అకౌంట్లలోని రూ.15 కోట్లు ఏమయ్యాయో తెలుసుకోవడంతోపాటు వాటితో డ్రగ్స్‌ కొనుగోలు చేసి వ్యాపారం చేశారా, అసలు ఆ మొత్తానికి, డ్రగ్స్‌కు ఏమైనా సంబంధం ఉందా.. అనే వివరాలను తెలుసుకునేందుకు ఈడీ కొత్తగా మరో కేసును ఫైల్‌ చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈడీ అధికారులు ఈ విషయమై ఇప్పటికే ఎన్‌సీబీ నుంచి కీలక పత్రాలను సేకరించి వాటిని పరిశీలిస్తున్నారు. తరువాత కొత్త కేసును నమోదు చేస్తారా, లేదా.. అన్న విషయంపై స్పష్టత వస్తుంది. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news