దేశవ్యాప్తంగా ఉన్న ఈపీఎఫ్‌వో చందాదారులకు ఆ సంస్థ శుభవార్త చెప్పింది. ఈపీఎస్ (ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్)లో చేరేందుకు గాను ఇప్పటి వరకు ఉన్న జీతం లిమిట్‌ను పెంచింది. ఇప్పటి వరకు నెలకు కేవలం రూ.6500 జీతం పొందే వారికి మాత్రమే ఈపీఎస్‌లో చేరేందుకు అర్హత ఉండేది. అయితే దీన్ని ప్రస్తుతం రూ.15వేలకు పెంచారు. దీని వల్ల రూ.15వేల వరకు నెల నెలా సంపాదించేవారు ఈపీఎస్‌లో చేరవచ్చు.
ఉద్యోగుల బేసిక్ శాలరీ, డీఏ కలిపి రూ.15వేల వరకు ఉంటే అలాంటి వారు ఈపీఎస్‌లో చేరవచ్చు. ఆ పరిమితి మించితే ఈపీఎస్‌లో చేరలేరు. ఇక ఈపీఎస్ లో చేరిన వారికి 58 ఏళ్ల తరువాత నెల నెలా నిర్దిష్టమైన మొత్తంలో పెన్షన్ వస్తుంది. అందుకు గాను 10 ఏళ్ల సర్వీసు ఉండాలి. అంటే.. ఒకే కంపెనీలో 10 ఏళ్ల పాటు కొనసాగి ఉండవచ్చు. లేదా అన్ని కంపెనీలు కలిపి 10 ఏళ్లు సర్వీసును కలిగి ఉండవచ్చు. అలాంటి వారు పైన తెలిపిన వేతనం లిమిట్ వరకు ఉంటే ఈపీఎస్‌లో చేరి 58 ఏళ్ల తరువాత నెల నెలా పెన్షన్ పొందవచ్చు.
అయితే 58 ఏళ్ల తరువాత లెక్క చూసినప్పుడు ఉద్యోగులకు 10 ఏళ్ల సర్వీసు లేకపోతే వారు 10సి ఫాంతో పెన్షన్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాంటి వారికి ఆపై పెన్షన్ ఇవ్వరు. ఇక అంగవైకల్యం ఉన్నవారు అయితే 10 ఏళ్ల సర్వీసు లేకున్నా సరే 58 ఏళ్లు దాటాక పెన్షన్ పొందవచ్చు.
ఇక ఈపీఎస్‌లో భాగంగా 50 ఏళ్ల తరువాత కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. 58 ఏళ్ల తరువాత మరో 2 ఏళ్ల పాటు అంటే.. 60 ఏళ్ల వరకు ఈ స్కీంను అవసరం అనుకుంటే పొడిగించుకోవచ్చు. ఆ తరువాత పెన్షన్ తీసుకోవచ్చు. అప్పుడు ఏడాదికి 4 శాతం అదనపు వడ్డీతో పెన్షన్ ఇస్తారు. ఇక నెల నెలా అందుకునే వేతనం ఎక్కువగా ఉంటే పెన్షన్ కూడా ఎక్కువగానే వస్తుంది.