రాష్ట్రంలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవలి కాలంలో తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు నానాటికీ పెరిగిపోతున్నాయి. కొందరు చదువు ఒత్తిడి భరించలేక నిండు ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా సికింద్రాబాద్ పరిధిలో రైలు కిందపడి ఓ ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
సిద్దిపేట జిల్లాకు చెందిన భార్గవి ఓయూ ఆంధ్ర మహిళా సభ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. మంగళవారం ఉదయం జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక పీఎస్‌కు సమాచారం అందింది. రైల్వే లోకో పైలట్ ఈ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.