కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్‌వో చందాదారులకు 8.5 శాతం వడ్డీని రెండు విడతలుగా చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో కు చెందిన సెంట్రల్ బోర్డు ట్రస్టీలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బోర్డుకు గాను కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆధ్వర్యంలో తాజాగా జరిగిన ఓ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 5 కోట్ల మంది ఈపీఎఫ్‌వో చందాదారులకు 2 విడతలుగా 8.50 శాతం వడ్డీని చెల్లించనున్నారు. ఈ క్రమంలో తొలుత 8.15 శాతం వడ్డీని చెల్లిస్తారు. తరువాత మిగిలిన 0.35 శాతం వడ్డీని డిసెంబర్‌లో చెల్లిస్తారు. అయితే కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కార్మిక సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఈపీఎఫ్‌వో 8.50 శాతం వడ్డీని ఒకే మొత్తంలో చెల్లించినా.. ఆ సంస్థ వద్ద రూ.700 కోట్ల వరకు మిగులు నిధులు ఉంటాయని, అలాంటప్పుడు వడ్డీని రెండు దఫాల్లో చెల్లించడం ఎందుకందని.. కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ఇక సదరు వడ్డీని చెల్లించేందుకు ఈపీఎఫ్‌వో ఈటీఎఫ్‌ల విక్రయం ద్వారా రూ.3500 కోట్ల నుంచి రూ.4వేల కోట్ల వరకు ఆదాయం రావచ్చని అంచనా వేసింది. అయితే మార్కెట్‌లో ఉన్న అస్థిరత కారణంగా ఆ మొత్తాన్ని ఈపీఎఫ్‌వో సమీకరించలేకపోయింది. మరోవైపు మార్చి 31, 2020తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌వోకు చెందిన రూ.1.03 లక్షల కోట్ల ఈక్విటీ పెట్టుబడులపై ఆదాయం 8.3 శాతం వరకు తగ్గింది. అందుకనే ఈపీఎఫ్‌వో రెండు దఫాల్లో ఆ వడ్డీ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధమైంది.