ఓ వైపు ఏపీలో కరోనాతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. రాజకీయం కూడా అమరావతి, కోర్టులు, కేసులతో హీటెక్కుతోంది. అధికార పార్టీ చర్యలపై ప్రధాన ప్రతిపక్ష మైన టీడీపీ నుంచి మాజీ నేతలు, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మత్రమే మాట్లాడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ గత నాలుగైదు నెలలుగా హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. దీనిపై ఏపీ ప్రజలు, అధికార పార్టీ నేతలే కాదు.. చివరకు సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. తాజాగా చంద్రబాబు నాలుగు రోజుల క్రితం ఏపీలో ఎంట్రీ ఇచ్చారు. మంత్రులు కొల్లు రవీంద్రను పరామర్శించిన ఆయన ఆ తర్వాత పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఆన్‌లైన్ కాన్ఫరెన్సులు, జూమ్ మీటింగులతో పార్టీ బాగుపడదని ఆయన నేరుగానే చంద్రబాబు వద్దే తన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు టీడీపీ వర్గాలు చెపుతున్నాయి. మీరు హైదరాబాద్‌లోనే ఎక్కువ కాలం ఉంటున్నారు… అప్పుడప్పుడు ఏపీకి వచ్చి వెళ్లిపోతున్నారు.. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉండకుండా పొరుగు రాష్ట్రంలో మకాం ఉండడంతో ప్రజల్లో కూడా రాంగ్ సిగ్నల్స్ వెళుతున్నాయని అయ్యన్న బాబుకు చెప్పారట. ఇలా అయితే పార్టీ పుంజుకోవడం కష్టమే అని కూడా ఆయన అన్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆయన కొందరు టీడీపీ నేతల గురించి కూడా పరోక్షంగా ఫైర్ అయ్యారని జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న టీడీపీ వర్గాలు లీక్ చేశాయి. కొందరు టీడీపీ నేతలు కేవలం ప్రచారం కోసమే పని చేస్తున్నారని.. వీరి వల్ల పార్టీకి చాలా నష్టం జరుగుతోందని ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయ్యన్న ఓపెన్‌గానే తన అసహనం వ్యక్తం చేయడంతో షాక్ అయిన చంద్రబాబు ఆయనకు సైతం ఏమీ చెప్పలేక మౌనం వహించారని అంటున్నారు. అయ్యన్న ఇచ్చిన వార్నింగ్‌తోనే చంద్రబాబు హైదరాబాద్ వెళ్లిన వెంటనే లోకేష్‌ను ఏపీకి వెళ్లాలని ఆదేశించారని టాక్..?
-vuyyuru subhash