ఈటల రాజేందర్ ఒంటరి పోరాటం…ప్లస్సా? మైనస్సా?

-

తెలంగాణ ప్రజలు దృష్టి అంతా ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నికపైనే…ఇక్కడ అధికార టీఆర్ఎస్ గెలుస్తుందా? లేక టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన ఈటల రాజేందర్ గెలుస్తారా? అని చెప్పి ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇంకా ఉపఎన్నిక షెడ్యూల్ రాకపోయిన సరే హుజూరాబాద్‌లో ఫైట్ గట్టిగా జరుగుతుంది. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నవారు, న్యూట్రల్‌గా ఉన్నవారు సైతం హుజూరాబాద్‌లో ఈటల గెలవాలని ఎదురుచూస్తున్నారు. అటు టీఆర్ఎస్ శ్రేణులు..తమ పార్టీ సత్తా చాటుతుందని చూస్తున్నారు.

etela-rajender | ఈట‌ల‌ రాజేందర్

అందుకే అధికార టీఆర్ఎస్ పార్టీ…తన అధికార బలంతో పాటు, మంది బలంతో హుజూరాబాద్‌లో గెలవడానికి ప్రయత్నిస్తుంది. సీఎం కేసీఆర్ దగ్గర నుంచి…చిన్న కార్యకర్త వరకు హుజూరాబాద్‌పైనే దృష్టి పెట్టారు.మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు…ఇలా ప్రతి ఒక్కరూ హుజూరాబాద్‌లో మకాం వేసి టీఆర్ఎస్ గెలుపు కోసం, కాలికి బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నారు. అటు మంత్రి హరీష్, టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ని వెంటబెట్టుకుని హుజూరాబాద్‌లో తిరుగుతున్నారు.

కానీ ఇటు వైపు ఈటల ఒక్కరే అయిపోయినట్లు కనిపిస్తోంది. ఈయనకు బీజేపీ నేతల నుంచి పెద్దగా సహకారం వస్తున్నట్లు లేదు. ఏదో ఈటల పార్టీలోకి వచ్చిన మొదట్లో కాస్త హుజూరాబాద్‌లో బీజేపీ నేతలు హడావిడి చేశారు. కానీ తర్వాత నుంచి అంతా ఈటల ఒక్కరే చూసుకుంటున్నారు. పాదయాత్ర కూడా మొదలుపెట్టి ప్రజల్ని కలిసి ప్రయత్నం చేశారు. కానీ ఆరోగ్యం బాగోక వెనక్కి తగ్గారు.

పోనీ బీజేపీ నేతలైన ఈటల కోసం తిరుగుతున్నారా? అంటే అది కనిపించడం లేదు. అధ్యక్షుడు బండి సంజయ్ మొదట్లో కనిపించారు గానీ, ఇప్పుడు ఆయన పాదయాత్రలో బిజీగా ఉన్నారు. మిగిలిన నేతలు కూడా పాదయాత్రపై ఫోకస్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటివరకు హుజూరాబాద్‌లో అడుగుపెట్టలేదు. ఏదో చిన్నాచితక నేతలు వచ్చి పోతున్నారే తప్ప, పూర్తిగా ఈటల కోసం నిలబడటం లేదు. ఇక ఈటల, ఈటల ఫ్యామిలీనే హుజూరాబాద్‌లో తిరుగుతున్నారు. మరి ఇలా ఒంటరి పోరాటం ఈటలకు ప్లస్ అవుతుందో, మైనస్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version