గాంధీ ఆస్పత్రిపై దుష్ప్రచారం.. సైకోలకు మంత్రి ఈటల వార్నింగ్

-

తెలంగాణలో కొత్తగా మరో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 983కి చేరిందన్నారు. శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గురువారం సాయంత్రం నుంచి నిర్వహించిన 500కు పైగా పరీక్షలో 13 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. అలాగే గాంధీ ఆస్పత్రికి కోవిడ్ ఆస్పత్రిగా నామకరణం చేస్తున్నట్టు ప్రకటించారు.

రాష్ట్రంలో కరోనా బాధితులను మెరుగైన సేవలు అందిస్తున్నట్టు మంత్రి చెప్పారు. వారికి పౌష్టికాహారం కూడా బాగానే అందుతుందన్నారు. అయితే కొందరు సైకోలు,శాడిస్టులు.. కరోనా బాధితులకు అందించే ఆహారం, ఇతర సౌకర్యాలు బాగోలేవని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీలో చికిత్స పొందుతున్న ఒక్క కరోనా పేషెంట్ కూడా సౌకర్యాలు బాగాలేవని చెప్పలేదన్నారు. డిశ్చార్జ్ అయినవారు తమకు అందిన సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారని గుర్తుచేశారు. పాత ఫొటోలతో చెడు ప్రచారం చేసే దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హచ్చరించారు. వైద్యులు, వైద్య సిబ్బంది మనో ధైర్యం దెబ్బతీయవద్దని కోరారు.

రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల నుంచే కరోనా కేసులు ఎక్కువ నమోదైనట్లు మంత్రి వెల్లడించారు. సూర్యాపేట, గద్వాల, జీహెచ్‌ఎంసీ, వికారాబాద్‌ ఈ నాలుగు ప్రాంతాల్లో నుంచే కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. వికారాబాద్‌లో 14 కుటుంబాల నుంచి 38 మందికి, గద్వాలలో 30 కుటుంబాలలో 45 మందికి, సూర్యాపేటలో 25 కుటుంబాల నుంచి 83 మందికి, జీహెచ్‌ఎంసీ పరిధిలో 44 కుటుంబాల నుంచి 265 మందికి కరోనా సోకినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news