ఒకపక్క కరోనా కష్టకాలం… మరోపక్క ఆర్ధిక ఇబ్బందులు… ఖజానాకు అవుట్ గోయింగ్ తప్ప ఇన్ కమింగ్స్ లేని పరిస్థితి… ఈ సమయంలో కూడా ఇచ్చినమాట నిలబెట్టాలని, సాకులు చెప్పడం.. తద్వారా తప్పించుకుపోవడం సరైన నాయకుడి లక్షణం కాదని… ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకాన్ని ప్రారంభించారు వైఎస్ జగన్. 90,37,254 మహిళలు సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు ఒకే విడత జమ అయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మహిళలు “ఈ టైం లో ఇది తమ కుటుంబాలకు ఎంతో భరోసా” అని సీఎం ను అభినందించేశారు! ఈ క్రమంలో టీడీపీ నేతలు మైకులముందుకు వచ్చేశారు… ఏమి మాట్లాడుతున్నాం… ఎందుకు మాట్లాడుతున్నాం… అసలు మనం మాట్లాడే మాటలకు అర్ధం ఉందా… అందులో వాస్తవ శాతం ఎంత… అనే ఆలోచనలు ఏమాత్రం చేయకుండా… జగన్ పై విమర్శలు గుప్పించారు.
జగన్ పరిపాలనపై ఇటు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు ఉపరాష్ట్రపతి స్థాయి వ్యక్తులు కూడా ప్రశంసల జల్లులు కురిపిస్తున్న నేపథ్యంలో… ఏపీ ప్రతిపక్ష నాయకులు మాత్రం బట్టకాల్చి మీదేసేపనులు మానడం లేదు!! సున్నా వడ్డీ పథకం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రారంభమయినా… చంద్రబాబు పరిపాలన మొదలయ్యక 2016 నుంచి ఈ పథకం నిలిచిపోయింది! నాటినుంచి నేటి వరకూ ఆ ఊసేలేదు! ఈ క్రమంలో రాష్ట్రం ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఈ పరిస్థితుల్లో సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయడం చిన్న విషయం కాదు. అయితే… ఇది ఎప్పటినుంచో ఉన్న పథకమే.. ఇదేమీ గొప్ప విషయం కాదు.. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన సున్నా వడ్డీ కార్యక్రమాన్ని చంద్రబాబు కొనసాగించారు అని అసత్య ప్రచారానికి తెరలేపారు టీడీపీ సీనియర్ నేత పంచుమర్తి అనురాధ! ఈ పథకాన్ని చంద్రబాబు 2016లోనే నిలిపేసిన సంగతి ప్రజలకు గుర్తులేదని ఆమె అలా అన్నారో ఏమో కానీ… మైకుల ముందుకు వచ్చి ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారు!
ఈ క్రమంలో మరో అర్ధంలేని అడ్డగోలు విమర్శలతో మైకందుకున్నారు తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత! సున్నావడ్డీ పథకానికి డబ్బులు విడుదల చేస్తున్నారని ప్రకటనరాగానే మీడియా ముందుకు వచ్చిన అనిత… జగన్ మహిళలను మోసం చేసారని, ఏడాదిగా వారిని వంచిస్తూనే ఉన్నారని.. సున్నా వడ్డీ పధకం పేరిట డ్వాక్రా మహిళలను జగన్ మోసం చేస్తున్నారని.. ఈ ప్రభుత్వానికి మహిళల ఉసురు తగలడం ఖాయం అని మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ మాటల్లో ఏమైనా అర్ధం ఉందా అన్న విషయం కనీసం ఆమెకు అర్ధం అయినా అదే పదివేలు అని టీడీపీ కార్యకర్తలు కూడా చెవులు కొరుక్కోవడం ఈ సందర్భంగా కొసమెరుపు!
ఈ క్రమంలో మిగిలిన టీడీపీ నాయకులు కూడా ఈ సున్నావడ్డీ పథకంపై రకరకాలుగా ఎవరికి తోచిన నెగిటివ్ కామెంట్స్ వారు చేస్తున్నారు. ఈ టీడీపీ నేతల కామెంట్స్ వింటున్నవారు మాత్రం… జగన్ సాహసోపేత నిర్ణయం టీడీపీ నేతల్లో మామూలు టెన్షన్ పుట్టిచ్చినట్లు లేదని కామెంట్స్ చేస్తున్నారు.