రేపు వినాయకుడి నిమజ్జనం కారణంగా హైదరాబాద్ లో మెట్రో సేవలను పొడిగించారు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం నేపథ్యంలో మెట్రో రైలు సమయాన్ని రేపు పొడిగిస్తు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రేపు మొదటి ట్రైన్ ఉదయం 6 గంటలకు, చివరి ట్రైన్ అర్ధరాత్రి ఒంటిగంటకు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి బయలుదేరుతాయని తెలిపారు. ప్రయాణికులు, భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మెట్రో సంస్థ కోరింది. ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రజలు వినాయక నిమజ్జన వేడుకలు చేసుకోవాలని సూచించారు.

కాగా హైదరాబాద్ లో ఖైరతాబాద్ వినాయకుడి విమర్జనం రేపు మధ్యాహ్నం లోపు జరిగే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. 11 రోజులపాటు పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణేశుడు రేపు గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు. ఇప్పటికే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. రేపు ఖైరతాబాద్ గణేషుడిని చూడడానికి ట్యాంక్ బండ్ వద్దకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటారు. దీంతో అధికారులు ట్యాంక్ బండ్ వద్ద భద్రత సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు.