తెలంగాణలో అమలులో ఉన్న మద్యం పాలసీ ఈ నెలాఖరుతో ముగియనుంది. దాంతో ప్రస్తుత వైన్ షాపుల లైసెన్స్ గడువు పూర్తి కానుంది. ఇక తరవాత తమకు లైసెన్స్ వస్తుందో లేదో అని వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని అందినంతా దోచుకుంటున్నారు. ఈ క్రమంలో మద్యం బాటిళ్ల పై ఎంఆర్పి కంటే అదనంగా రూ 10 నుండి 20 వసూలు చేస్తూ మందుబాబులకు షాక్ ఇస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఇతర నగరాల్లో ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయిస్తున్నారు.
కానీ పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 15 నుండి 20 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లో బీర్లు మరియు కొన్ని లిక్కర్ బ్రాండ్ లకు డిమాండ్ ఎక్కువ ఉంటుందని ఒక బీరు పై 20 రూపాయలు లిక్కర్ పై 15 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్కువ డిమాండ్ ఉన్న బ్రాండ్ల బీరు అమ్మకుండా ఎవరూ ఆసక్తి చూపని బీరు బ్రాండ్లను అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.