ఫేస్బుక్ ద్వారా పరిచయాలు ఏర్పడి.. ఆ తర్వాత నెమ్మదిగా ప్రేమలో పడటం.. ఆ తర్వాత అసలు విషయం తెలిసి తలబాదుకోవడం ఇదంతా ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఆన్లైన్ స్నేహాలు చాలా వరకు మోసపూరితమైనవనే విషయంపై నేటి యువతకు ఇంకా అవగాహన రావడం లేదు. అలా ఓ అమ్మాయి ఫేస్బుక్లో పరిచయమైన అబ్బాయితో స్నేహం చేసింది. కొద్ది రోజుల తర్వాత ఇద్దరు ప్రేమలో పడ్డారు. తీరా పెళ్లి చేసుకుందామనేసరికి అసలు విషయం తెలిసి ఆ అమ్మాయి.. ఆమె కుటుంబం షాక్ అయింది. ఇంతకీ ఆ షాకింగ్ విషయం ఏంటంటే..?
ఫేస్బుక్లో తనను తాను అబ్బాయిలా పరిచయం చేసుకొని ఓ అమ్మాయికి టోకరా వేశాడు ట్రాన్స్జెండర్ అయిన సివిల్ ఇంజినీర్. కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని విట్ల పట్టణంలో ఈ ఘటన జరిగింది. నాలుగేళ్లుగా ఆ అమ్మాయితో రోజు చాట్ చేస్తున్నాడు. ఫేస్బుక్లో సందేశాలు పంపించుకోవడం సహా ఫోన్లలో తరచుగా మాట్లాడుకునేవారు. అయితే, ప్రేమ విషయం ఇంట్లోవారికి తెలియగానే నిందితుడి బాగోతం బట్టబయలైంది.
ఆ యువతి కుటుంబ సభ్యులు నిందితుడి ఫేస్బుక్ వివరాలు సేకరించి.. తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన అడ్వొకేట్కు ఇచ్చారు. ఆ వివరాల సాయంతో నిందితుడి ఆచూకీ తెలుసుకున్న లాయర్.. అతడు ట్రాన్స్జెండర్ అని తెలిసి.. ఆ అమ్మాయిని మోసం చేశాడని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు. ఉడుపి జిల్లాలోని ఓ ప్రాంతంలో నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మహిళను మోసం చేసినందుకు కేసు నమోదు చేశారు.