సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రచారం అవుతున్న అనేక వార్తల్లో నకిలీ వార్తలే ఉంటున్నాయి. కొన్ని నకిలీ వార్తలను మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలే అసలు వార్తలని నమ్మి బొక్క బోర్లా పడుతున్నాయి. తాజాగా అలాగే జరిగింది. బడ్వయిజర్ బీర్ కంపెనీ ఉద్యోగి ఒకరు గత 10 సంవత్సరాలుగా బీర్ ట్యాంకుల్లో మూత్రం పోస్తున్నాడని, ఆ విషయాన్ని స్వయంగా అతనే వెల్లడించాడని.. కనుక ఆ బీర్‌ను ఎవరూ తాగకూడదని.. ఓ వార్త ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదని వెల్లడైంది.
foolishhumour.com అనే ఓ వెబ్‌సైట్‌లో పైన తెలిపిన బడ్వయిజర్ వార్తను ప్రచురించారు. నిజానికి అది ఓ సెటైరికల్ వెబ్‌సైట్. అందులో అన్నీ అలాంటి వార్తలే పోస్ట్ చేస్తారు. అవన్నీ ఫేక్ వార్తలు. అవి ఫేక్ వార్తలని, వాటిని నమ్మకూడదని, తాము కేవలం వినోదం కోసమే అలాంటి వార్తలను పోస్ట్ చేస్తున్నామని సదరు వెబ్‌సైట్ యాజమాన్యం ఆ పోస్టుల్లో గమనికలను కూడా ఇచ్చింది. కానీ వాటిని చూడని కొన్ని మీడియా సంస్థలు ఆ వార్త నిజమే అని నమ్మి దాన్ని తమ వెబ్‌సైట్లలో పోస్టు చేశాయి. దీంతో ఆ వార్త ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది.
అయితే తరచి చూస్తే.. ఆ వార్త నిజం కాదని, ఫేక్ అని వెల్లడైంది. సదరు వెబ్‌సైట్‌లో కేవలం సరదాకు పెట్టిన ఓ పోస్టును పట్టుకుని కొన్ని వెబ్‌సైట్లు ఈ విషయాన్ని సీరియస్‌గానే తీసుకుని వార్తలను రాశాయి. అయితే ఆ విషయంలో ఎంతమాత్రం నిజంలేదని, అదంతా పుకారేనని, ఆ బీర్‌లో ఎవరూ మూత్రం పోయడం లేదని వెల్లడైంది. ఈ క్రమంలో ఈ వార్తను ఫేక్ వార్త అని నిర్దారించారు. కనుక తెలిసింది కదా.. సోషల్ మీడియా ఎంత పనిచేస్తుందో. ఇలాంటి వార్తలను నమ్మే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి.