కరోనా ఉన్నా నెగటివ్ అనే సర్టిఫికేట్.. ఇది నయా దందా గురూ !

కుక్కపిల్ల సబ్బు బిళ్ళ అగ్గిపుల్ల కాదేదీ కవిత్వానికి అనర్హం అని ఒక కవి అన్నట్టు హాస్పిటల్స్ యాజమాన్యాలు కూడా ప్రతి దాన్నీ వ్యాపార కోణంలో చూస్తూ ప్రజాల ప్రాణాలతో గేమ్స్ ఆడుతున్నాయి. తాజాగా కర్ణాటకలో ఒక నయా దందా వెలుగులోకి వచ్చింది. అదేంటంటే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలరింగ్ ఇస్తూ ఫేక్ నెగటివ్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్టు తేలింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా హాస్పిటల్స్ చాలా మందికి ఈ కరోనా నెగటివ్ సర్టిఫికేట్ లు అమ్మినట్టు చెబుతున్నారు. ఈ మేరకు బెంగళూరు సిటీలో పలు ఆస్పత్రుల్లో యాజమాన్యాల లీలలు సంచలనంగా మారాయి.

కర్ణాటకలోని బెంగళూరులోని కొన్ని ఆసుపత్రుల్లో ఈ దందా జరుగుతోంది. ఎవరైనా ఇతర ప్రాంతాలకి వెళ్ళాలంటే కరోనా నెగటివ్ తప్పని సరి అంటూ ప్రభుత్వం పెట్టిన నిభందనను ఈ ఆసుపత్రులు గట్టిగా క్యాష్ చేసుకుంటున్నాయి. డబ్బు కట్టండి మీకు కరోనా ఉన్నా లేకున్నా నెగటివ్ అనే ఇస్తామని బేరసారాలకు దిగుతున్నాయి. క్వారెంటైన్ కి భయపడి కొందరు, వేరే చోట్ల పని ఉండి మరికొందరు ఈ ఫేక్ సర్టిఫికెట్లు కొనేస్తున్నారు. నిజంగా కరోనా లేకుంటే పర్లేదు, ఒక వేళ ఉన్న వ్యక్తికి కూడా కరోనా నెగటివ్ ఇస్తే అతను విచ్చలవిడిగా తిరిగి మరికొందరికి అంటిస్తే పరిస్థితి ఏమిటా అనేది ఇప్పుడు ఆందోళన కారంగా ఉంది.