చైతన్యం ఉన్న జిల్లాగా నల్గొండ Nalgondaకు మంచి పేరుంది. అయితే ఇక్కడ రాజకీయ నేతలు కూడా అదే స్థాయిలో తమ సత్తాను చాటుతూ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన చరిత్ర కూడా వీరికి ఉంది. అలాంటి ఉద్యమ జిల్లాలో ఇప్పుడు రాజకీయాలు రాజుకుంటున్నాయి. మంత్రి జగదీశ్ రెడ్డకి, కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మొదటి నుంచి తీవ్ర వివాదాలు ఉన్నాయి. ఇక అవి ఇప్పుడు తారా స్థాయికి చేరుకున్నాయి. మునుగోడు వేదికగా మొన్న అగ్గి రాజుకుందనే చెప్పాలి.
రీసెంట్ గా మునుగోడులో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి జగదీశ్ హాజరయ్యారు. ఇక ఇదే అదునుగా భావించి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వివాదానికి తెర లేపారు. దీంతో మంత్రికూడా అదే స్థాయిలో రెచ్చిపోవడంతో ఈ వివాదం కాస్తా పెద్ద ఎత్తున సాగింది. అటు మంత్రి వర్గీయులు, ఇటు ఎమ్మెల్యే వర్గీయుల మధ్య పెద్ద యుద్ధ వాతావరణమే సాగింది.
ఇక ఈ సందర్భంగా స్టేజీ మీదే రాజగోపాల్ రెడ్డి ఆగ్రహంతో సహనం కోల్పోయిన మంత్రి జగదీశ్ చేతుల్లోని మైకును లాక్కోవడంతో టీఆర్ ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. ఇక అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా మంత్రిపై చాలా సీరియస్ అవుతున్నారు. ఇక బుధవారం మంత్రి జగదీశ్ రెడ్డి మళ్లీ మునుగోడుకు వెళ్లడంతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన అనుచరగణంతో పెద్ద ఎత్తున నిరసన తెలపడం ఆయన్ను అరెస్టు చేయడం జరిగాయి. ఇక ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి ఏకంగా మంత్రికి తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు. మంత్రిని తన నియోజకవర్గంలో తిరగనివ్వనంటూ చెప్పడం పెద్ద సంచలనంగా మారింది. మరి ఈ వివాదాలు ఏ స్థాయికి వెళ్తాయో చూడాలి.