ఎలుక వినాయకుని వాహనంగా పూజలందుకుంటుంది. వినాయకుడి ఆలయంలో ఖచ్చితంగా స్వామి వారి పాదాల వద్ద ఎలుక ఉంటుంది. అయితే మానవులు ఎలుకను సహజంగా శత్రువుగా చూస్తారు. కారణం నిత్య జీవితంలో దీని వలన అనేక కష్ట, నష్టాలను అనుభవించుటవలన. ముఖ్యంగా రైతులకు ఎలుక చేయు నష్టం అంతా ఇంతా కాదు. పంట చేలను నాశనం చేయడం, ధాన్యపు గాదులకు రంధ్రాలు చేయడం నిలువ ఉంచిన ధాన్యం పాడు చేయడం లాంటివి. బట్టలు, పుస్తకాలు ఇలా ఎన్నో కొరికి పాడు చేయడం వల్ల మనుషులకు చిరాకు తెప్పిస్తాయి.
అయితే వీటిని నివారించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎలుకలు మాత్రం చాలా తెలివిగా మనుషులను బురిడీ కొట్టిస్తాయి. అది దాక్కుని మనుషులను ముప్పతిప్పలు పెట్టించి ఆడిస్తుంటాయి. వాస్తవానికి ఎలుకలకు మనతో దాగుడు మూతలు ఆట ఆడడం అంటే మహా సరదా అని జర్మన్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ క్రమంలోనే 30 మీటర్ల గదిలో కొన్ని ఎలుకలను ఉంచి నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందట.
అవి ఎందుకలా ప్రవర్తిస్తాయన్న దానిపై చేసిన పరిశోధన ప్రకారం దాగుడు మూతలంటే వాటికి చాలా సరదా అని, అందుకే అవి అలా చేస్తాయని పరిశోధకులు వెల్లడించాడు. మనుషుల్ని చూసినప్పుడు అవి ఆనందంతో ఆటను కొనసాగించేందుకు పదేపదే దాక్కుంటాయని తెలిపారు. సరికొత్త వ్యూహాలతో మనకు తెలియకుండానే మనల్ని ఆ ఆటలోకి దింపుతాయని లేటెస్ట్ సర్వే తేల్చేసింది.