శ్రీసత్యసాయి జిల్లాలో ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. సీఎం జగన్ కాన్వాయ్‌ని తుంపర్తి భూనిర్వాసితులు అడ్డుకున్నారు. నష్టపరిహారంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ రోడ్డుపై బైఠాయించి సీఎం జగన్‌పై రైతులు శాపనార్థాలు పెట్టారు. రైతులను పక్కకు నెట్టేసి సీఎం కాన్వాయ్‌ని పోలీసులు పంపించారు. సీఎం జగన్ పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. భద్రతా సిబ్బంది వారిని తప్పించింది. దీంతో జగన్ కాన్వాయ్ ముందుకు సాగింది.
పేదలకు ఇళ్ల స్థలాల కోసమంటూ తుంపర్తి, మోటుమర్రు ప్రాంతంలో 210 ఎకరాలు సేకరించిన అధికారులు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిహారం ఇప్పించడంలో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విఫలమయ్యారని మండిపడ్డారు. తాము సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చామని, కానీ పోలీసులు తమను తోసేశారని ఆవేదన వ్యక్తం చేశారు.