కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేసేంత వరకు పోరాటం చేసిన రైతంగం.. మరోసారి పోరాటానికి సిద్దం అయింది. కనీస మద్దతు ధర కు చట్ట బద్దత తో పాటు సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమంలో రైతులపై మోపిన అక్రమ కేసులను ఉప సంహరించుకోవాలని, అలాగే ఈ ఉద్యమంలో అకారణంగా మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోవాలనే తమ డిమాండ్ల పై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతు సంఘాలు నాయకులు మండి పడుతున్నారు.
తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 21 న దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. కనీస మద్దతు ధరతో పాటు రైతులపై ఉన్న కేసులను వెనక్కి తీసుకునేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. అలాగే మృతి చెందిన రైతు కుటుంబాలను ఆదుకోవడం తో పాటు అనేక హామీలపై కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించింది.
కాగ కనీస మద్దతు ధర గ్యారంటీ వారం అనే పేరు తో ఏప్రిల్ నెలలో 11 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు ఆందోళనలు చేస్తామని ప్రకటించింది. ఆ వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు, మీటింగ్ లు, ఆందోళనలు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ప్రకటించింది.