హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి రాంగ్ రూట్లో వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో సదరు బైక్ నడిపే వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. బ్రహ్మయ్య (45) అనే వ్యక్తి రాంగ్ రూట్లో వస్తుండగా.. అదే సమయంలో వనస్థలిపురానికి చెందిన విజయ్ కుమార్ ఐమాక్స్ నుంచి కారులో వేగంగా వెళ్తున్నాడు.
సరిగ్గా టర్నింగ్ దగ్గరకు వచ్చేసరికి బ్రహ్మయ్య రాంగ్ రూట్లో వస్తుండగా.. అతడిని తప్పించబోయి కారు అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన బ్రహ్మయ్యను హైదర్‌గూడలోని ఓ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆరా తీశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.