ఒకప్పుడు బంగారం, నగదు, ఇళ్లు, స్థలాలు ఉంటే ధనవంతులు అనే వాళ్లు. కానీ ప్రస్తుతం ఇంట్లో ఎవరైనా టమాట కూర వండితే.. మీరు బాగా రిచ్ అంటున్నారు. అలా ఓ రిచ్ డాడీ తన కూతురు పుట్టిన రోజు ఘనంగా చేయాలనుకున్నాడు. సాధారణంగా గ్రాండ్‌గా అంటే.. డెకరేషన్, ఇన్విటేషన్లు, పెద్దగా పార్టీ చేయడం వంటివి చేస్తుంటారు. కానీ ఈ తండ్రి మాత్రం తన కూతురు పుట్టిన రోజున ఏకంగా 4 క్వింటాళ్ల టమాట పంపిణీ చేశాడు.
హైదరాబాద్ పంజాగుట్ట ప్రతాప్‌నగర్‌కు చెందిన టీఎమ్మార్పీఎస్ యువసేన అధ్యక్షుడు నల్ల శివ తన కుమార్తె పుట్టిన రోజున టమాటలు పంచిపెట్టాడు. ఏకంగా 4 క్వింటాళ్ల వరకు టమాటలను పంపిణీ చేసి ఔరా అనిపించాడు. టమాట ధరలు ఆకాశాన్నంటిన తరుణంలో బిడ్డ పుట్టిన రోజు సందర్భంగా పెద్ద మొత్తంలో టమాటాలను ఉచితంగా పంపిణీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇక గత కొన్ని రోజులుగా మార్కెట్లో టమాటల ధర రూ.150 నుంచి రూ.300 వరకు పలుకుతున్న విషయం తెలిసిందే.