కస్టమర్లను ఆకర్షించాలంటే ఏ సంస్థకైనా ఉన్న మొదటి ఆప్షన్ ఆఫర్లు. ఇలా ఆఫర్ల మాయలో పడి చాలా మంది కస్టమర్లు ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంటారు. పౌడర్ డబ్బా నుంచి ఫార్చునర్ కారు వరకు ఏది కొనాలన్నా ముందు ఏమైనా ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్నాయా అనే చూస్తారు. కస్టమర్ల ఈ వీక్ నెస్ ని బలంగా మార్చుకుని ఎన్నో కంపెనీలు లాభాల బాట పట్టాయి. అందుకే పండుగ పూట వచ్చిందంటే చాలు.. ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తాయి చాలా కంపెనీలు. ఇప్పుడు ఆ బాటలో ఆటోమొబైల్ దిగ్గజాలు కూడా ఓ ముందడుగేశాయి.
స్వాతంత్య్ర దినోత్సవం, కృష్ణాష్టమి, వినాయక చవితి ఇలా వరుసగా ఈనెలలో పండుగలు ఉన్నందున ఆటోమొబైల్ దిగ్గజాలు ఈ ఫెస్టివల్ సీజన్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాయి. అందుకే కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్ల జల్లు కురిపిస్తున్నాయి. ఎంట్రీ లెవల్, చిన్న కార్లపై డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటించాయి. ఇందులో దిగ్గజ సంస్థలు కార్లుపోటీ పడుతుండటం విశేషం. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్, రెనాల్ట్ తమ కార్లను తక్కువ ధరల్లోనే కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చాయి.
మారుతి సుజుకి
మారుతి కొన్ని మోడల్‌లు రూ. 50,000 వరకు భారీ ఆఫర్‌తోపాటు, క్యాష్ ఎక్స్ఛేంజ్ బోనస్‌ల రూపంలో తొమ్మిది నుంచి 60వేల రూపాయల దాకా డిస్కౌంట్‌లను అందిస్తోంది. మారుతి సుజుకి ఆల్టో, వ్యాగన్ ఆర్, క్లెరియో, ఎస్-ప్రెస్సో, స్విఫ్ట్ , డిజైర్ వంటి మోడళ్లపై నగదు తగ్గింపులను అందిస్తోంది. అన్ని మోడల్‌లు కూడా ఎక్స్ఛేంజ్ బోనస్ లభ్యం.
రెనాల్ట్ ఇండియా
రెనాల్ట్ ఇండియా క్విడ్ హ్యాచ్‌బ్యాక్, ట్రైబర్ MPV, కిగర్ కాంపాక్ట్ SUV తదితర మోడళ్లపై రూ. 60,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఇంకా నగదు తగ్గింపులు, స్క్రాపేజ్ ప్రయోజనాలు ,ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో కూడా అందిస్తోంది. దీంతోపాటు ప్రత్యేక ఫ్రీడమ్ కార్నివాల్ ఆఫర్ కింద రూ. 5,000 విలువైన యాక్సెసరీలు ఉచితం. అలాగే తన అన్ని మోడళ్లలో యాక్సెసరీలపై పరిమిత ఫ్రీడమ్ కార్నివాల్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది.
హ్యుందాయ్
దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుందాయ్ సాంత్రో, ఐ10 నియోస్, ఔరా, ఐ20, ఎక్స్‌ంట్, కొనా ఈవీ వంటికార్లపై సుమారు రూ.13 వేల నుంచి రూ.50 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్లు, అదనపు ఇన్సెంటివ్‌లు అందించనుంది.
టాటా మోటార్స్
టాటా మోటార్స్ వివిధ మోడళ్లలో పండుగ సీజన్ డిస్కౌంట్లు 20- 40వేల రూపాయల విలువైన పథకాలను అందిస్తోంది. ప్రధానంగా టియాగో, టైగోర్, నెక్సాన్, సఫారీ వంటి మోడల్ కార్లపై రూ.40 వేల వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. అలాగే ఓనం పండుగ సందర‍్భంగా కేరళ వాసుల కోసం బంపర్ ఆఫర్లను ప్రకటించింది.
దేశీయంగా మహీంద్రా కూడా ఎక్స్‌యూవీ300, బొలెరో, బొలెరో నియో వంటి మోడల్ కార్లపై పలు ఇన్సెంటివ్‌లు, ఆఫర్లు ప్రకటించింది. గత నాలుగు నెలల్లో రిటైల్ విక్రయాలు వెనుకబడి ఉన్నాయి. ఎంట్రీ లెవల్‌లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు ప్రస్తుతం పుంజుకుంటున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమోటివ్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వింకేష్ గులాటి వెల్లడించారు. రానున్న నెలల్లో మెరుగైన సరఫరాతో, కస్టమర్ల వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా తగ్గించాలని కోరారు. దీనికి అనుగుణంగా ప్యాసింజర్ వెహికల్ ఒరిజినల్-ఎక్విప్‌మెంట్ తయారీదారులందరూ మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా తమ సరఫరాలను రీకాలిబ్రేట్ చేయాలని గులాటీ కోరారు.
గత కొన్ని నెలలుగా తమ ప్రొడక్షన్ ప్లాంట్లలో 95 శాతం ఉత్పత్తి చేయాలని ప్రణాళికల్లో ఉన్నామని మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా కార్ల ఉత్పత్తి చేయడం కార్ల తయారీ సంస్థలకు పెద్ద సవాల్ అని పేర్కొన్నారు.