ప్రమాదవశాత్తు ఓ మసీదులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలోని ఓ మసీదులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి మసీదు డోమ్ కుప్పకూలింది. జకార్తాలో ఉన్న ఇస్లామిక్ సెంటర్ గ్రాండ్ మసీదులో గతకొంతకాలంగా పునఃనిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే మసీదులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకున్నాయి.
ఈ క్రమంలో మసీదు డోమ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కాగా, ప్రమాద సమయంలో మసీదులో పునర్‌నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని స్థానిక మీడియా వెల్లడించింది. ఇస్లామిక్ సెంటర్ ఆవరణలో పలు విద్యా సంస్థలు, వాణిజ్య కేంద్రాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు అధికారులు. దీనిపై కేసు నమోడు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.