హైదరాబాద్: నగర శివారు ప్రాంతం అదిరిపడింది. ఉదయం ఒక్కసారిగా కేకలు, అరుపులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఏం జరుగుతుందో తెలిసే లోపే మొత్తం బూడిదపాలు అయ్యింది. అసలు విషయానికొస్తే జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం జరిగింది. నాసెన్స్ కెమికల్ కంపెనీలో మంటలు చెలరేగాయి. ఈ మంటలు భారీగా అలుముకోవడంతో కంపెనీలో ఆందోళన పరిస్థితి నెలకొంది. కార్మికులు తేరుకునే లోపే మంటలు భారీగా వ్యాపించాయి. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని కంపెనీ నుంచి బయటకు పరుగులు తీశారు. భారీ శబ్ధాలతో కెమికల్ డ్రమ్ములు పేలడంతో పరిసర ప్రాంతాలు ఉలిక్కిపడ్డాయి.
ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. మొత్తం కెమికల్ కావడంతో మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. అటు పోలీసులు కూడా సహాయ చర్యల్లో పాల్గొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కంపెనీలో తొలి ఫిప్ట్ కావడంతో భారీ ప్రాణనష్టం తప్పిందని భావిస్తున్నారు.