అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో.. ఇప్పుడు అందరిలో ఆయన గురించి, ఆయన కంటే ముందు భారత్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షుల గురించే చర్చ జరుగుతున్నది. కానీ, భారత్‌లో పర్యటించిన అమెరికా ప్రథమ మహిళల గురించి పెద్దగా చర్చలేదు. అమెరికా ప్రథమ మహిళల్లో కొందరు భర్తలతో కలిసి భారత్‌కు రాగా, మరికొందరు ఒంటిరిగా పర్యటించారు. మరి, మనమిప్పుడు వాళ్లలో ఎవరు ఎప్పుడు వచ్చారు, ఏం చేశారు అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..?
1962లో జాన్ ఎఫ్ కెన్నడీ సతీమణి జాక్వెలైన్ కెన్నడీ ఒంటరిగా భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె తాజ్‌మహల్ సహా పలు ప్రదేశాలను సందర్శించారు. రాజస్థాన్‌లో ఒంటెపై సవారీ చేశారు. గంగానదిలో పడవ ప్రయాణం చేశారు. అంతకుముందు పాలం ఎయిర్‌పోర్టులో అమెరికా రాయబారి భార్య, అప్పటి ప్రధాని నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ జాక్వెలైన్ కెన్నడీకి ఘన స్వాగతం పలికారు.
1969లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌తో కలిసి ఆయన సతీమణి ప్యాట్ నిక్సన్ భారత్‌లో పర్యటించారు. అమె కేవలం ఒక్కరోజు మాత్రమే భారత్‌లో ఉన్నారు. ఆ తర్వాత 1978లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీకార్టర్‌తో కలిసి ఆయన శ్రీమతి రోజలిన్ కార్టర్ భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి ఢిల్లీ సమీపంలోని ఛుమా ఖేరాగావ్ గ్రామాన్ని సందర్శించారు. ఆ గ్రామానికి ఒక టీవీని బహుమతిగా ఇచ్చారు. గ్రామస్తులు కూడా ఆమెకు శాలువా కప్పి సన్మానించారు. ఓ చిన్నారి చేత రోజలిన్ నుదిటికి తిలకం పెట్టించారు. కార్టర్ దంపతుల సందర్శనతో ఆ గ్రామం ‘కార్టర్‌పురి’ గా మారిపోయింది.
1984లో అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు హెచ్‌డబ్ల్యూ బుష్ (సీనియర్ బుష్)తో కలిసి ఆయన సతీమణి బార్బరా బుష్ మనదేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆగ్రాకు వెళ్లి తాజ్‌మహల్‌ను సందర్శించారు. అక్కడి ఇద్దరూ కలిసి కొన్ని ఫొటోలు దిగారు. భారత పర్యటనకు వచ్చి వెళ్లిన తర్వాత బుష్ అమెరికా అధ్యక్షుడు కూడా అయ్యారు.
అమెరికా ప్రథమ మహిళగా ఉన్నప్పుడు హిల్లరీ క్లింటన్ రెండుసార్లు భారత్‌లో పర్యటించారు. అయితే ఆ రెండు పర్యటనల్లో ఒక్కసారి కూడా ఆమె భర్త, అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ హిల్లరీ వెంట లేరు. 1995లో మొదటిసారి కూతరు చెల్సియాతో కలిసి వచ్చిన ఆమె.. తాజ్‌మహల్ సహా దేశంలోని అనేక దర్శనీయ ప్రాంతాలను సందర్శించారు. రాజ్‌ఘాట్‌లో మహాత్మడి సమాధి దగ్గర నివాళులర్పించారు. 1997లో మథర్‌థెరిసా అంత్యక్రియల్లో పాల్గొనడం కోసం రెండోసారి ఆమె మన దేశంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో బిల్‌క్లింటన్ భారత్‌లో పర్యటించినా అప్పుడు ఆయన వెంట హిల్లరీ లేరు. కూతురు చెల్సియాతో కలిసి వచ్చారు.
2006లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జార్జి డబ్ల్యూ బుష్‌తో కలిసి ఆయన సతీమణి లారా బుష్ భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఓ పాఠశాలను, జీవనజ్యోతి దివ్యాంగుల హోమ్‌ను సందర్శించారు. నోయిడాలో ఫిల్మ్‌సిటీలో సందడి చేశారు. హైదరాబాద్‌లో కూడా మూడు గంటలు పర్యటించిన ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మిషెల్ ఒబామా కూడా అమెరికా ప్రథమ మహిళ హోదాలో రెండుసార్లు భారత్‌లో పర్యటించారు. అయితే రెండుసార్లు కూడా ఆమె భర్తతో కలిసే వచ్చారు. 2010లో మొదటిసారి వచ్చిన మిషల్ ఒబమా.. ముంబైలోని ఓ పాఠశాలలో పిల్లలతో కలిసి నృత్యం చేశారు. ఆ తర్వాత ముంబై యూనివర్సిటీలో ప్రసంగం ద్వారా ఆకట్టుకున్నారు. 2015లో రెండోసారి భారత్‌కు వచ్చిన మిషెల్.. బరాక్ ఒబామాతో కలిసి భారత ఘనతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు.
ఇప్పుడు తాజాగా మెలానియా ట్రంప్.. తన భర్త డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి భారత్‌కు వస్తున్నారు. ఈ సందర్భంగా మెలానియా సోమవారం మధ్యాహ్నం భర్త ట్రంప్‌తో కలిసి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. సాయంత్రం తాజ్‌మహల్ అందాలను వీక్షించనున్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తారు.