దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు టీకాలను తీసుకునేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున రిజిస్టర్ చేసుకున్నారు. మే 1వ తేదీ నుంచి 18-44 ఏళ్ల వయస్సు వారికి టీకాలను వేస్తామని ప్రకటించినా తగినన్ని వ్యాక్సిన్లు లేకపోవడంతో 45 ఏళ్లకు పైబడిన వారికే టీకాలను ఇస్తున్నారు. అది కూడా రెండో డోసు వారికే టీకాలను ఇస్తున్నారు. అయితే టీకాల కోసం వ్యాక్సిన్ సెంటర్లకు వెళ్లేవారు ఈ సూచనలను కచ్చితంగా పాటించాలి. లేదంటే వైరస్ వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆ సూచనలు ఏమిటంటే…
1. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండడం, డబుల్ మ్యుటంట్ వైరస్ కావడంతో ప్రతి ఒక్కరూ డబుల్ మాస్కులను ధరించాలని, అప్పుడే చాలా వరకు రక్షణ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
2. మాస్కులను ధరించినప్పటికీ కళ్ల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు కనుక ఫేస్ షీల్డ్‌లను ధరిస్తే మంచిది. దీంతో వైరస్ రాకుండా అడ్డుకోవచ్చు.
3. చేతులకు రబ్బర్ గ్లోవ్‌లను ధరించాలి. వాటిని శానిటైజ్ చేసుకోవాలి. శరీరాన్ని చేతుల్తో తాకరాదు.
4. వ్యాక్సిన్ సెంటర్ల వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంటాయి. కానీ ఎవరికి వారు వ్యక్తిగత శానిటైజర్లను తీసుకెళ్లడం ఉత్తమం. ఎందుకంటే ఒకటే శానిటైజర్‌ను అందరూ వాడితే వైరస్ వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఎవరి శానిటైజర్‌ను వారు వెంట తీసుకెళ్లడం మంచిది.
5. వ్యాక్సిన్ సెంటర్ల వద్ద ఇతరులు ఎవరితోనూ మాట్లాడరాదు. ముఖానికి మాస్క్‌లు, ఫేస్ షీల్డ్ లు ధరించాం కదా అనుకోవచ్చు. కానీ వైరస్ ఏ రూపంలో వస్తుందో తెలియదు. కనుక టీకా కేంద్రాల వద్ద వీలైనంత వరకు మాట్లాడకపోవడమే మంచిది.
6. టీకా కేంద్రాల వల్ల పబ్లిక్ టాయిలెట్లను వాడరాదు. వాటి ద్వారా కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.