చాలామంది ఆడవాళ్లు గర్భవతిగా ఉన్నప్పుడు బరువు పెరగడం సహజమే. అలాగే కొంతమంది మహిళలు ప్రసవము అయిన తరువాత బరువు తగ్గిపోతారు. కానీ, కొంతమంది మహిళలు మాత్రం ప్రసవం అయిన తరువాత కూడా బరువు తగ్గకపోగా ఇంకాస్త బరువు పెరుగుతారు. అందుకనే ప్రసవం అయిన తరువాత బరువు పెరగకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం. బరువును అదుపులో ఉంచడానికి వ్యాయామం అనేది చాలా ముఖ్యమైన మార్గం. కానీ, ప్రసవం తరువాత ఎటువంటి ఒత్తిడి పడకూడదని, అలాగే విశ్రాంతి కూడా తీసుకోవాలని డాక్టర్లు చెబుతారు. ఇలా రెస్ట్ తీసుకోవడం వల్ల శారీరక శ్రమ ఉండదు. దాని వల్ల డెలివరీ తర్వాత ఎక్కువ బరువు పెరుగుతారు.
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సాధారణంగా చాలామంది చేసే పెద్ద తప్పు భోజనం తినకుండా ఉండటం లేదా తక్కువ తీసుకోవడం. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతాము అని అనుకుంటారు. నిజానికి అది పొరపాటు. రోజులోని ముఖ్యమైన భోజనాన్ని తీసుకోకపోవడం వల్ల మీ శరీరం ఆకలితో ఉంటుంది. మీ శరీరంలోని జీవక్రియ ప్రక్రియ కూడా మందగిస్తుంది. ఇలా మందగించడం వల్ల మీరు తినే పరిమిత ఆహారం నుండి ఎక్కువ కొవ్వును తీసుకోవడమే కాకుండా దాన్ని శరీరంలో నిల్వ చేస్తుంది. ఇది మరింత బరువు పెరగడానికి దారితీస్తుంది. భోజనాన్ని మానెయ్యటానికి బదులుగా ఇలా చేసి చుడండి..
మీ రోజులో భోజనాన్ని తినకుండా ఉండే బదులు, మీరు మీ ఆహారంలో కావలిసిన పోషకాలు ఉండేలా మీ భోజనాన్ని మార్చుకోవచ్చు. ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం కంటే, సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం బరువు తగ్గే విషయంలో మీకు మంచి ప్రభావాన్ని కలిగిస్తుంది. అలాగే ప్రసవం తరువాత షుగర్, వేయించిన ఆహార పదార్ధాలను తినడం పూర్తిగా మానెయ్యాలి. ఈ సమయంలో మీ శరీరానికి విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు వంటి సరైన పోషకాలు అవసరం, వీటిని ఆరోగ్యకరమైన ఆహారాల నుండి సులభంగా పొందవచ్చు. అలాగే ఇంకొక ముఖ్య సూచన ఏంటంటే.. చాలా మంది నిద్ర ఎక్కువ పోవడం వల్ల మన శరీర బరువు పెరుగుతుంది అని నమ్ముతారు. కానీ అది అబద్దం. తగినంత నిద్రపోవడం వల్ల మీకు ఎనర్జీ రావడమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలను కూడా రాకుండా చేస్తుంది. ప్రసవం తర్వాత ఆరోగ్యకరమైన ధాన్యాలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల బరువు తగ్గుతారు.