నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సిగరేట్ల నిల్వ, సుంకం చెల్లించకుండా అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన రూ.5.50 కోట్ల విలువ చేసే సిగరెట్లను ధ్వంసం చేసినట్లు ఏపీ కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి వెల్లడించారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న సిగరెట్లను గుంటూరు, విశాఖపట్నంలో గల జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌లలో శుక్రవారం కాల్చి బూడిద చేశామని తెలిపారు.
కమిషనర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. కాకినాడ, విజయవాడ, నెల్లూరు, తిరుపతిలో చెకింగ్ అధికారులు పట్టుకున్న 82,71,836 విదేశీ సిగరెట్లను స్వచ్ఛతాహీ సేవ 4.0 కార్యక్రమంలో భాగంగా కాల్చి బూడిద చేశామని తెలిపారు. గుంటూరు జిందాల్ ప్లాంట్ వారి సహకారంతో 73.71 లక్షల సిగరెట్ స్టిక్‌లు, విశాఖ జిందాల్ ప్లాంట్ వారి సహకారంతో 9 లక్షల సిగరెట్లను ధ్వంసం చేశామన్నారు. పర్యావరణానికి హాని కలగకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని కమిషనర్ వెల్లడించారు.