బీజేపీ గూటికి మాజీ ఎంపీ వివేక్..? నేడో, రేపో పార్టీలో చేరిక..?

-

వివేక్ ఇవాళ లేదా రేపు బీజేపీలో చేరే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. అమిత్ షా తో భేటీ అయి ఆయన సమక్షంలోనే వివేక్ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని తెలిసింది.

ఇటీవల జరిగిన లోక్‌స‌భ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకొని మంచి జోష్ మీద ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికలకు ఆ పార్టీ ఇప్పటి నుంచే సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీలోనూ అసంతృప్త నేతలు, ఆయా పార్టీలకు చెందిన ఇతర నేతలను బీజేపీ తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఏపీలో టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు ఇప్పటికే బీజేపీలో చేరగా టీడీపీకి చెందిన మరింత మంది ఎమ్మెల్యేలు త్వరలోనే బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. ఇక తెలంగాణ విషయానికొస్తే ఇక్కడ కాంగ్రెస్, టీడీపీలతోపాటు టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న పలువురు నేతల‌ను బీజేపీ త‌మ‌ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే మాజీ టీఆర్ఎస్ నేత, మాజీ ఎం వివేక్ ను బీజేపీ ఇప్పుడు తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంద‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ త‌ర‌ఫున‌ పెద్దపల్లి ఎంపీ టికెట్ వస్తుందని ఆశించి వివేక్ భంగపడ్డారు. చివరి నిమిషంలో ఆ టికెట్‌ను కేసీఆర్‌ బోర్లకుంట వెంకటేశ్‌ కి ఇచ్చారు. స్థానికంగా ఉన్న తెరాస‌ ఎమ్మెల్యేల వ్యతిరేకతతోనే కేసీఆర్ ఆ టికెట్‌ను వివేక్ కు కాకుండా వెంకటేష్ కి ఇచ్చారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన వివేక్ టీఆర్ఎస్ పార్టీతోపాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. అయితే వివేక్ కు బీజేపీ అప్పట్లోనే ఎంపీ టికెట్ ఇవ్వజూపింది. అయితే సమయం తక్కువ ఉన్నందున పోటీకి సన్నద్ధం కాలేమ‌ని చెప్పి వివేక్ బీజేపీ ఆఫర్‌ను తిరస్కరించారు. కానీ ఇప్పుడు అదే పార్టీలోకి వెళ్లాలని వివేక్ ఆలోచిస్తున్నార‌ని తెలిసింది.

కాగా వివేక్ ఇవాళ లేదా రేపు బీజేపీలో చేరే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. అమిత్ షా తో భేటీ అయి ఆయన సమక్షంలోనే వివేక్ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని తెలిసింది. అయితే వివేక్ గ‌న‌క బీజేపీలో చేరితే కమల ద‌ళానికి తెలంగాణలో మీడియా అండ పుష్కలంగా లభించినట్లే. ఎందుకంటే ప్రస్తుతం వివేక్ ఆధ్వర్యంలో నడుస్తున్న వీ6 ఛానల్ తో పాటు వెలుగు పత్రిక కూడా బీజేపీ గొంతుకను వినిపించే అవకాశం ఉంటుంది. దాంతో ఆ విషయంలో బీజేపీ తెలంగాణలోని ఇత‌ర పార్టీల‌కు గ‌ట్టి పోటీనిచ్చే అవ‌కాశం ఉంటుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version