పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సంఘం తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటు ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ సదుపాయాన్ని తాజాగా రాజకీయ కురువృద్ధులు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ,మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మాజీమంత్రి మురళీ మనోహర్ జోషి సద్వినియోగం చేసుకున్నారు. దీనికి సంబంధించిన విషయాన్ని ఢిల్లీ ఎన్నికల సంఘం వెల్లడించింది.
గురువారం నుంచి దేశ రాజధాని ఢిల్లీలో ఈ వెసులుబాటు అందుబాటులోకి రాగా.. మే 24 వరకు దానిని ఉపయోగించుకోవచ్చు. దీనికింద శుక్రవారం ఢిల్లీలోని 7 నియోజకవర్గాల నుంచి 1409 మంది ఓటేశారు. ఈ ప్రక్రియలో భాగంగా 85 సంవత్సరాలు పైబడినవారు, 40శాతానికిపైగా అంగవైకల్యం ఉన్నటువంటి ఓటర్ల దగ్గరికి పోలింగ్ సిబ్బంది వచ్చి ఓటు వేయించుకుంటారు. నిబంధనలకు అనుగుణంగా ఓ కంపార్టుమెంట్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌ను తెస్తారు.