జూన్ 2 నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే జూన్ 9న పాకిస్థాన్ తో గ్రూప్ స్టేజ్ లో టీమ్ ఇండియా తలపడనుంది. అయితే, ఆ ఒక్కసారే కాకుండా టైటిల్ పోరు దాయాదుల మధ్యే జరగాలని.. ఆ మ్యాచ్ వీక్షిస్తే అద్భుతంగా ఉంటుందని భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ వ్యాఖ్యానించాడు. అమెరికా-విండీస్ సంయుక్త ఆతిధ్యంలో మెగా టోర్నీ జరగనుంది.
“టాప్-4లో న్యూజిలాండ్ దక్కించుకుంటుంది. ఐసీసీ ఈవెంట్లలో కివీస్ ను తక్కువగా అంచనా వేయొద్దు. ఇక విండీస్ తమ స్వదేశంలో టోర్నీ జరుగుతుంది. ఆ జట్టులోని ప్రతీ ఆటగాడూ భీకరమైన ఫామ్లో ఉన్నారు. అందుకే అత్యంత ప్రమాదకరమైన టీమ్. ఇక ఆసీస్, పాకిస్థాన్లో ఒక జట్టే నాకౌట్ వస్తుంది. ఒకవేళ పాక్ వస్తే మాత్రం ఫైనల్ లేదా సెమీస్ లో భారత్ నే ఢీకొట్టే అవకాశం ఉంది. నాకు మాత్రం తుది పోరును ఇరు జట్ల మధ్యే చూడాలని ఉంది. ఇప్పటివరకు ఐసీసీ టోర్నీల్లో మనదే ఆధిపత్యం. మరోసారి అదే కొనసాగుతుందని భావిస్తున్నా” అని కైఫ్ వివరించాడు.