ఇప్పటివరకు కేవలం మనుషులకే పరిమితమైన మహమ్మారి కరోనా వైరస్.. ఇతర ప్రాణులకు కూడా వ్యాపిస్తుంది. తాజాగా ఓ పులికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. న్యూయార్క్ బ్రోంక్స్ జూలోని నాలుగేళ్ల ఆడ పులి నాడియకి కరోనా సోకింది. ఈ విషయాన్ని లోవాలోని నేషనల్ వెటర్నరీ సర్వీసెస్ లాబోరేటరీ ధ్రువీకరించింది. నాడియ సంరక్షణ బాధ్యతలు చూస్తున్న జూ సిబ్బంది నుంచి దానికి కరోనా సోకినట్టుగాత తెలిపింది.
మరోవైపు నాడియతో పాటు ఉన్న మరో మూడు పులులు, మూడు ఆఫ్రికన్ సింహాలు కొంత అనారోగ్యానికి గురయ్యాయని.. అయితే అవి ప్రస్తుతం కోలుకుంటున్నాయని అధికారులు తెలిపారు. ‘నాడియను పూర్తిగా పరీక్షించాం. కరోనా గురించి తెలుసుకునే ఏ చిన్న విషయమైన.. దానిపై అవగాహన పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. పులులు, సింహాలు వంటి జంతువుల్లో వైరస్ ఎలా అభివృద్ధి చెందుతుందో తెలియదు. కొత్త రకం వైరస్‌కు ఒక్కో ప్రాణి ఒక్కోలా స్పందిస్తుంది. అందుకే జంతువులన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్నాం’ అని జూ అధికారులు తెలిపారు.
అయితే ఒక మనిషి నుంచి జంతువుకు కరోనా సోకడం ప్రపంచంలోనే తొలిసారి అని నిపుణులు చెపుతున్నారు. ఇప్పటికే కరోనా దాటికి అమెరికా చిగురాటకుల వణికిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు జంతువులకు కూడా కరోనా సోకడంతో మరో కొత్త సమస్య తయారైందని జూ అధికారులు చెప్తున్నారు.